తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి తిరిగి అధికారంలోకి రావాలని బిఆర్ఎస్ ప్రయత్నం చేయటంలో వింతేమీ లేదు. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా చేసే పని అదే. అయితే ఇందుకు ఆ పార్టీ తో పాటు పార్టీ నేతలు ఎంచుకునే విధానం మాత్రం కచ్చితంగా ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి బిఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు లు వ్యవహరిస్తున్న తీరు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల మొదలైన అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ ..బయట కూడా ఈ కీలక నేతలు ఇద్దరూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా బిఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నాయి అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. అటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు లు ఇంకా తెలంగాణ ఉద్యమ కాలం రాజకీయాల దగ్గరే ఆగిపోయినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో బిఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు ప్రజలు ఎవరూ ఇంకా మర్చిపోలేదు. పైగా పదే పదే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెన్ జీ రేవంత్ రెడ్డి పాలనను గమనిస్తోంది అని... ప్రధాని మోడీ నే ఢీకొట్టిన వాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లెక్క అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఆయన ఇక్కడ చాలా కన్వీనెంట్ గా ఒక విషయం మరిచిపోతున్నారు. అదే జెన్ జీ అసెంబ్లీ ముందు...మహిళా పోలీస్ లు ..మహిళా ఎమ్మెల్యేలు ఉండగా టీ షర్ట్ విప్పిన సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ను చూశారు...పోలీసులతో దురుసుగా వ్యవహరించిన కేటీఆర్ తో పాటు ఇతర ఎమ్మెల్యేల తీరును కూడా గమనించారు. కేటీఆర్ పదే పదే చెప్పే జెన్ జీ తో పాటు కాస్త విజ్ఞతతో ఆలోచించే వాళ్ళు ఎవరూ ఈ చర్యలను సమర్ధించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను..హామీల అమలు లో చేస్తున్న జాప్యంతో పాటు ఏ ఇతర అంశం లో అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ పోరాటం చేయటాన్ని ఎవరూ తప్పుపట్టరు. మరో వైపు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ పై ఏ మాత్రం సమర్థనీయం కానీ...తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి వీడియోల్లోనే రికార్డు అయినా కూడా బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు లు తమ సభ్యుడు అలా అనలేదు అని..అవి స్పీకర్ ను ఉద్దేశించి కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు.
అంతే కాకుండా కెసిఆర్ ఉండే ఫార్మ్ హౌస్ కు కాంగ్రెస్ కు చెందిన నేతలు, శ్రేణులు దండోరా నిర్వహించగా ఆ ప్రాంతాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేసిన వ్యవహారం కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు లు తమ చర్యలతో పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నారు అని ఇది పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు అనే అభిప్రాయాన్ని కొంత బిఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు గత వెయ్యి రోజులుగా జరిగే అతి కొద్ది రోజుల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫార్మ్ హౌస్ కు పరిమితం అవటం కూడా ప్రజలకు తప్పుడు సంకేతాలే పంపుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ నేతలు ఎలా చేసినా వాటికి అప్పుడు ఆమోదం లభించింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల్లో కొత్తగా వచ్చిన యువ ఓటర్ల నుంచి మాత్రం బిఆర్ఎస్ చర్యలకు మద్దతు దక్కే అవకాశం లేదు. బిఆర్ఎస్ అధికారంలో ఉండగా అసెంబ్లీని దేవాలయంగా చెప్పిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు అసెంబ్లీ ముందు చొక్కాలు విప్పి..పోలీస్ లపైనే దాడులు చేసేలా వ్యవహరించటంతో వీళ్ళ చర్యలకు ఏ మాత్రం మద్దతు దక్కటం లేదు అనే చెప్పొచ్చు. తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయటం ఒక్కటే సరిపోదు ...ఆ సమయంలో వ్యవస్థలను...మనుషులను ఆ పార్టీ కీలక నేతలు ఎలా చూస్తున్నారు అన్నది కూడా కీలకమే.