దేశమంతటా పోటీ చేసే ఎంఐఎం తెలంగాణాలో చేయదా?!

Update: 2023-05-19 03:32 GMT

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని గుర్తిస్తే జరిగే నష్టం ఏమిటో ఆయనకు తెలుసు కాబట్టి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ప్రయోగాలు చేసినా..కొత్త అభ్యర్థులను బరిలో నిలిపినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మరో కీలక విషయం ఏమిటి అంటే కర్ణాటక ఎన్నికల్లో మైనారిటి లు కాంగ్రెస్ పార్టీ కి పూర్తి అండగా నిలబడ్డారు. ఇది ఆ పార్టీ ఘన విజయానికి కారణం అయింది అని చెపుతున్నారు. గత రెండు టర్మ్ లు గా తెలంగాణ లో అధికార బిఆర్ఎస్ వైపు ఉన్న మైనారిటీ లు ఈ సారి తెలంగాణాలో కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది. బీజేపీ ని గట్టిగా ఎదుర్కొనే పార్టీ అంటే కాంగ్రెస్ మాత్రమే అనే అభిప్రాయం ఎక్కువ మంది మైనారిటీ ల్లో ఉంది. మిగిలిన పార్టీలు అవసరాలకు అనుగుణంగా అటు ఇటు ప్లేట్ ఫిరాయిస్తున్నాయి. తెలంగాణాలో పొత్తు లేకపోయినా బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీ లు మిత్ర పక్షాలుగా ఉన్నాయి. అయితే ఈ సారి అది ఎంతమేర ఫలితాన్ని ఇస్తుంది అన్నది వేచిచూడాల్సిందే. తెలంగాణ లో కూడా కర్ణాటక తరహాలోనే మైనారిటీ లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అని...ఎంఐఎం తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఒక కార్యాచరణ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

                               ఒక వైపు ఎంఐఎం పార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో అభ్యర్థులను పెడుతూ తెలంగాణలో మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో తాము 40 నుంచి 50 సీట్ల లో పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. మరి వచ్చే ఎన్నికల్లో అక్బరుద్దీన్ చెప్పినట్లు పోటీ చేస్తారా లేక...బిఆర్ఎస్ కోసం ఎప్పటిలాగానే అసదుద్దీన్ నిర్ణయం తీసుకుంటారా అన్నది కూడా కీలకం కానుంది. దేశంలోని ఇతర కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే ఎంఐఎం ఇక్కడ మాత్రం ఒక్క హైదరాబాద్ లో తప్ప మిగిలిన బలమైన నియోజకవర్గాల్లో సైతం పోటీ పెట్టకపోవడం అంటే అది బిఆర్ఎస్ లాభం చేయటానికే అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంఐఎం దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ కి మేలు చేసుందుకే ఆ పార్టీ పని చేస్తోంది అని పలు పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక తరహాలో తెలంగాణాలో కూడా మైనారిటీ లు కాంగ్రెస్ వైపు మళ్లితే అధికార బిఆర్ఎస్ కు కష్టాలే అని చెపుతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ సర్కారుపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత ఉంది. దీనికి తోడు మైనారిటీ లు కూడా అటు వైపు చూస్తే ఇక అంతే సంగతులు అనే చర్చ సాగుతోంది. మరి ఈ పరిణామాలు అన్నీ రాబోయే ఆరు నెలల కాలంలో ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయి వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News