పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాదికే అంటే మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడిస్తూ...ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ తో ఒక పోస్టర్ ను సోషల్ మీడియా లో షేర్ చేసింది. వాస్తవానికి ఈ సినిమా ఇదే నెలలో మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పాన్ ఇండియా హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీ విడుదల వాయిదా పడటంతో చిత్ర యూనిట్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలను ముందుకు జరిపి ఉగాది పండగకు ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. గబ్బర్ సింగ్ మూవీ సూపర్ డూపర్ హిట్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే కావటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయనే చెప్పాలి.
అదే సమయంలో పవన్ లేటెస్ట్ మూవీ ఓజీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ఉంది అనే చెప్పాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీ లీల తో పాటు రాశీ ఖన్నా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు తొలుత మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. పాటలు అన్నిటికి ఆయనే ట్యూన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ ను తీసుకున్నట్లు కూడా మైత్రి మూవీ మేకర్స్ తాజాగా పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అంటే ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ లు పని చేసినట్లు. ఒకరు పాటలకు..మరొకరు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు. సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుండటం...దేవిశ్రీ ప్రసాద్ ఇతర పనుల్లో బిజీ గా ఉండటంతో పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.