ఉస్తాద్ ఊసు లేదు

Update: 2026-03-20 06:32 GMT

టాలీవుడ్ టాప్ హీరో ల వ్యవహారశైలి ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉగాది రోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ఒకటి భారీ హైప్ ఉన్న ధురంధర్ 2 ...మరొకటి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే టాలీవుడ్ టాప్ హీరోలు గా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక్క మాట మాట్లాడకపోగా..అందరూ వరసపెట్టి ధురంధర్ 2 మూవీ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్స్ చేశారు. ధురంధర్ 2 సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ జాబితాలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో లు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయదేవరకొండలు ఉన్నారు.

                                   అందరి కంటే ముందే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ధురంధర్ 2 పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ మూవీ టేకింగ్ స్టైల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా కూడా వీళ్ళు అంతా కూడా ధురంధర్ 2 పై ప్రత్యేక ప్రేమ చూపించారు కానీ...సహా నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో మాట మాత్రం గా కూడా ఎవరూ ప్రస్తావించకపోవటం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు...సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన కు చెందిన మంత్రి కందుల దుర్గేష్ దగ్గరే ఉంది. రేపు తమ కొత్త సినిమాల టికెట్ రేట్ల పెంపుతో పాటు ప్రీమియర్ షోస్ అనుమతి కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయదేవరకొండలు లేదా వాళ్ళు నిర్మాతలు అంతా పవన్ కళ్యాణ్ నో...ఆయన పార్టీ కి చెందిన మంత్రి కందుల దుర్గేష్ నో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది.

                                         అయినా సరే వీళ్ళు అంతా కూడా ఒక సినిమా అది కూడా హిందీ సినిమా విషయంలో ఎక్కడ లేని ప్రేమ చూపించి...పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో కనీసం స్పందించకపోవటం బయటవాళ్ళకు కూడా ఏ మాత్రం సరైన సంకేతాలు పంపదు అని పరిశ్రమకు చెందిన ఒక కీలక నిర్మాత ఒకరు అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ టాప్ హీరో లు అంతా ధురంధర్ 2 గురించి ట్వీట్స్ చేసి ఉస్తాద్ విషయంలో మౌనంగా ఉండటంతో ఈ వ్యవహారం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ 2 కు సూపర్ హిట్ టాక్ రాగా....ఉస్తాద్ భగత్ సింగ్ కు మాత్రం ఎక్కువ శాతం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కారణాలు ఏమైనా కూడా హిందీ సినిమా గురించి మాట్లాడిన వాళ్ళు...సొంత భాష కు చెందిన సినిమా విషయంలో కూడా స్పందించి ఉంటే వీళ్లకు గౌరవం పెరిగేది అనే చర్చ సాగుతోంది. టాలీవుడ్ టాప్ హీరో లు అంతా ధురంధర్ 2 పై ట్వీట్స్ వేయటం వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఈ సినిమా కు హైప్ తేవటం అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది అనే చర్చ పరిశ్రమ వర్గాల్లోనే ఉంది.

Full View

Tags:    

Similar News