సుప్రీం కోర్టు లో రేట్ల పెంపుకు అనుమతి !

Update: 2026-03-13 09:41 GMT

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కు టికెట్ రేట్ల పెంపు ఉంటుంది లేదా అన్న సందేహాలు పరిశ్రమ వర్గాల్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణా హై కోర్టు కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలే. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని తప్పుడు పడుతూ కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. అదే సమయంలో ఇక నుంచి ఎవరైనా విడుదలకు 90 రోజుల దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. దీనిపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుప్రీమ్ కోర్టు ను ఆశ్రయించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మించింది కూడా ఇదే సంస్థ.

                                     Full Viewమైత్రి మూవీ మేకర్స్ పిటిషన్ పై శుక్రవారం నాడు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హై కోర్ట్ ఆదేశాలపై స్టే విధించింది. ప్రస్తుతానికి టికెట్ ధరల పెంపు విషయంలో ఎప్పుడూ అనుసరిస్తున్న విధానంతో ముందుకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ రేట్లు పెంపునకు మార్గం సుగమం అయింది. దీంతో అటు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణాలో కూడా ప్రేక్షకులకు అదనపు భారం పడటం ఖాయం. ప్రీమియర్స్ తో పాటు గతంలో లాగానే వారం నుంచి పది రోజుల పాటు అదనపు రేట్లు వసూలుకు వెసులుబాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకే కాకుండా కొత్తగా విడుదల అయ్యే అన్ని సినిమాలకు వర్తించనుంది.

Tags:    

Similar News