అమరావతి బంతి పూర్తిగా కూటమి సర్కారు కోర్ట్ లోనే

Update: 2026-07-02 12:41 GMT

చరిత్రలో ఎలా నిలిచిపోవాలో నిర్ణయించుకోవాల్సింది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో అధికారం ఉంటే టీడీపీ చేతిలో...లేదు అంటే వైసీపీ చేతిలోనే ఉంటుంది. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తన వైఖరి ఏంటో తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ ఎజెండా మావిగన్ వర్సస్ అమరావతిగానే ఉంటుంది అని కుండబద్దలు కొట్టారు. రాజధానిగా అమరావతిని పార్లమెంట్ సాక్షిగా గుర్తించినా...దీనిపై ప్రస్తుత ప్రభుత్వం గతంలో చేసిన ఖర్చు...ఇప్పుడు పెడుతున్న మొత్తం కలుపుకుని 75000 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా కూడా జగన్ మాత్రం అమరావతిని అంగీకరించటం లేదు. దీంతో జగన్ అమరావతిలో ఇటుక కూడా అటు తీసి ఇటు పెట్టడానికి ఏ మాత్రం ఇష్టపడరు అని తేలిపోయింది. సహజంగా ఒక ముఖ్యమంత్రికి...ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని నిర్మాణ అవకాశం రావటమే అరుదైన విషయం. కానీ టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫస్ట్ టర్మ్ లోనే తాత్కాలిక రాజధాని..శాశ్వత రాజధానులు అంటూ గందరగోళం చేసి...ఈ మొత్తం ప్రాజెక్ట్ ను గాడిన పెట్టలేకపోయారు.

                                 రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఐదేళ్లు పూర్తిగా పక్కనపడేసిన అమరావతి ప్రాజెక్ట్ లో వేగం పెరిగింది..కేంద్ర సహాయం కూడా ఈ సారి కలిసి వచ్చింది. అయినా కూడా రాజధాని అమరావతిలో పనులు ఆశించిన స్థాయిలో సాగటం లేదు అనే విషయం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలోనే తేలింది. స్పీడ్ పెంచాలని ఆయనే అధికారులను..కాంట్రాక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనుల్లో వేగం పెంచేందుకు అని స్వయంగా తెచ్చుకుని అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసిఎల్) ఎండీగా నియమించుకున్న ఎస్ వి శ్రీనివాస్ అక్కడ ఇమడలేక తన పదవికి రాజీనామా చేసి వెళ్లారు అంటే అమరావతి లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం తెచ్చిపెట్టుకున్న రిటైర్డ్ అధికారికే అక్కడ పని చేసే వాతావరణం లేకుండా చేశారు అంటే తెర వెనక ఏమి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.

                          మరో వైపు ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సిఆర్ డీఏ కమిషనర్ విజయరామ రాజుల మధ్య బాగా గ్యాప్ ఉన్నట్లు ఆ శాఖ వర్గాలే చెపుతున్నాయి. అమరావతి వంటి కీలక ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న శాఖలో ఇంత గందరగోళం ఏ మాత్రం మంచిది కాదు అనే చర్చ టీడీపీ నేతల్లో ఉంది. అయితే ఈ విబేధాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా దృష్టిపెట్టిన దాఖలాలు కూడా లేవు అని చెపుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్నికల ఫలితాలను తేల్చేది అప్పటి పరిస్థితులు...ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సారి అన్నా ఎన్నికలకే ముందే అమరావతి ఫస్ట్ ఫేజ్ లో అన్ని పనులు పూర్తి చేసి...రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తారా?. లేక ఫస్ట్ టర్మ్ లో చేసినట్లే ఈ సారి కూడా అమరావతిని అసంపూర్తిగా వదిలేస్తారా?. అదే జరిగితే...అటు రైతులతో పాటు ఈ పనులు చేస్తున్న వాళ్ళు కూడా మరో సారి చిక్కుల్లో పడటం ఖాయం. ఇప్పుడు అమరావతి లో పనులు సాగుతున్న తీరు..స్పీడ్ చూసి ఎన్నికల నాటికీ ఈ ప్రాజెక్ట్ ఏ మేరకు పూర్తి అవుతుంది అనే అంశంపై టీడీపీ నేతల్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి పనులు పూర్తి చేయటానికి నిధుల సమస్య కంటే ఇతర సమస్యలే ఎక్కువ పాత్ర పోషిస్తున్నట్లు కనపడుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

                             ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తూ పోతోంది అని...పనిలో పనిగా మరో పదివేల కోట్ల రూపాయలు అదనపు అప్పులు చేసి అయినా సరే చంద్రబాబు తన ఈ టర్మ్ పూర్తి అయ్యేలోగా పనులు పూర్తి చేయకపోతే మాత్రం ఇంత మంచి ఛాన్స్ వచ్చినా కూడా రాజధాని పూర్తి చేయలేక చరిత్రలో ఆయన ఫెయిల్యూర్ సీఎం గా మిగిలిపోతారు అని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు బాల్ పూర్తిగా చంద్రబాబు కోర్ట్ లోనే ఉంది. ఆయన దాన్ని ఎక్కడకు కొడతారో చూడాలి. ఇది తేలాలంటే 2028 చివరి వరకు ఆగాల్సిందే. రాజధాని విషయంలో ఇప్పటికే మూడు సార్లు మాటలు మార్చిన జగన్ కు ఇది రాజకీయం నష్టం చేసే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా ఎక్కువ మందిలో ఉంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన 15 సంవత్సరాల తర్వాత కూడా రాజధాని అంశాన్ని ఎజెండాగా చేస్తాను అని చెప్పటం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు అనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా ఉంది.

Full View

Similar News