ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లెక్కలు అన్నీ తప్పాయి. అమెరికా ముందు ఇరాన్ ఎంత అనుకున్నారు. వారం నుంచి రెండు వారాల్లోనే అంతా పూర్తి చేయవచ్చు అనుకున్నారు. ఆ దేశానికి చెందిన సుప్రీం లీడర్ ను హత మార్చినా...ఎంతో మంది సైనిక నేతలను టార్గెట్ చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ లు చంపేసినా కూడా ఇరాన్ మాత్రం పోరాటం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. అగ్రరాజ్యం అమెరికా కు ఒక్క మాటలో చెప్పాలంటే చుక్కలు చూపిస్తోంది. యుద్ధ భారం మోయటంతో అమెరికా లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత తప్పించుకునేందుకు డోనాల్డ్ ట్రంప్ ఎలాగోలా ఈ యుద్ధం నుంచి బయటపడాలి తప్ప...ఇరాన్ అయితే తాను దేనికైనా రెడీ అనే సంకేతాలు పంపుతోంది. అయితే నిజంగా ఇరాన్ కు అంత శక్తి ఉందా...ఇది శత్రువును భయపెట్టడానికి వాడుతున్న అస్త్రమా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ఇరాన్ ను తక్కువ అంచనా వేయటానికి వీలులేదు అని ఎక్కువ మంది చెపుతున్న మాట.
ఇరాన్ ఈ యుద్దాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా డోనాల్డ్ ట్రంప్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అందులో భాగంగా అమెరికా కు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుంది. ఈ విషయంలో భారత్ ప్రభుత్వం ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదు కానీ..అమెరికా, ఇజ్రాయెల్ లు కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగా ఒక్క దేశీయ స్టాక్ మార్కెట్ లోనే నష్టం 50 లక్షల కోట్ల రూపాయలపై మాటే. పెరిగిన ఇంధన ధరలు...గ్యాస్ సరఫరా ఇబ్బందులు..ఇలా వీటి అన్నిటిని కలుపుకుంటే ఈ నష్టం మరింత ఎక్కువే ఉంటుంది. పరిస్థితి అర్ధం అయిందో..లేక రాబోయే రోజుల్లో మరింత పరువు పోతుంది అని భయపడ్డారా ఏమో కానీ డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ యుద్ధం ఇక రెండు నుంచి మూడు వారాలు మించి ఉండకపోవచ్చు అని ప్రకటించారు.
ఇరాన్ తమతో ఒప్పందం చేసుకునేందుకు అడుక్కుంటుంది అని చెప్పుకుంటున్నారు. అయితే ఇరాన్ నుంచి వస్తున్న సంకేతాలు అయితే మాత్రం అలా ఉన్నట్లు ఎక్కడా కనిపించటం లేదు. ఇరాన్ నుంచి తాము త్వరలోనే వైదొలుగుతాం అని డోనాల్డ్ ట్రంప్ చెపుతున్నారు. మరో వైపు ఇరాన్ కు పెద్ద ఎత్తున అమెరికా దళాలను పంపుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి అమెరికా భూతాల దాడులకు దిగే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనే లెక్కలు కూడా వేస్తున్నారు ఈ రంగంలోని నిపుణులు. మరి అమెరికా అంత రిస్క్ చేస్తుంది లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఇరాన్ తమతో ఎలాంటి ఒప్పందానికి ముందుకు రాకపోయినా కూడా తాము మాత్రం యుద్దాన్ని ముగిస్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించటం విశేషం. అయితే ఇరాన్ అణు సామర్ధ్యం తగ్గింది అన్న విషయంలో స్పష్టత వచ్చిన వెంటనే తాము వెనక్కి వస్తామన్నారు.
ఇరాన్ ను తాము చావు దెబ్బతీశామని...ఆ దేశం కోలుకోవడానికి ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ దాడుల్లో ఆ దేశంలో సైనిక స్థావరాలు కూడా పూర్తిగా నాశనం అయ్యాయి అని తెలిపారు. అమెరికా లో డోనాల్డ్ ట్రంప్ ఆమోద స్థాయి మైనస్ 17 శాతానికి పడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ట్రంప్ బుధవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. అది కూడా ఇరాన్ అంశంపై అని చెప్పటం తో ఈ ప్రకటన ఏమై ఉంటుంది అని ప్రపంచ దేశాలు అన్ని ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరో వైపు అమెరికా లో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజల్లో డోనాల్డ్ ట్రంప్ తీరు పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరో వైపు గత కొంత కాలంగా పదే పదే పట్టుబట్టిన హర్ముజ్ జలసంధి విషయాన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ పట్టించుకునే దశలో ఉన్నట్లు కనిపించటం లేదు.