ల్యాండ్ డీల్స్ లో ముగ్గురు రాయలసీమ మంత్రులు బిజీ!

Update: 2026-04-11 04:40 GMT

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కీలక మంత్రి ఒకరు ఇప్పుడు ఆరు చేతులతో సంపాదిస్తున్నారు అన్న చర్చ మంత్రుల్లోనే హాట్ టాపిక్ గా మారింది. మనిషికి ఉండేదే రెండు చేతులు అయితే ఆరు చేతులతో సంపాదన ఎలా సాధ్యం అన్నదే కదా మీ డౌట్. ఇప్పటికే ఆ కీలక మంత్రి తన ఇద్దరు కొడుకులకు సబ్జెక్టు లు కేటాయించి మరీ వసూళ్ల బాధ్యతలు అప్పగించారు. ఆ పని వాళ్లిద్దరూ విజయవంతంగా నడిపిస్తున్నట్లు కూడా చెపుతున్నారు. తన శాఖ వ్యవహారాలు సరిపోవు అన్నట్లు ఆయన ఇప్పుడు ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు కీలక జిల్లాల్లో భూముల వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున దందా నడిపిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఒక్కరే కాదు..రాయలసీమకు చెందిన మొత్తం ముగ్గురు కీలక మంత్రులు ఇదే పనిలో ఉన్నారు అని..అయితే ఈ కీలక మంత్రి మాత్రం తన పరిధిని పలు ఇతర జిల్లాలకు కూడా విస్తరించుకుంటూ పోతున్నట్లు చెపుతున్నారు.

                                ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ జోన్లు...ఇతర పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయో ఆ ప్రాంతంలో భూములకు విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాలపైనే ఆయన ఫోకస్ పెడుతున్నారు అని...తన దగ్గర వివిధ పనుల కోసం వచ్చే వాళ్ళ ద్వారా వివిధ రకాల సమాచారం సేకరించి వాటి ఆధారంగా ఆయన తన ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు ఒక కీలక అధికారి వెల్లడించారు. ప్రభుత్వ పనులు...రాష్ట్ర ప్రజలకు సంబంధించిన పనుల్లో మంత్రుల మధ్య సమన్వయం ఎలా ఉందో ఎవరికీ తెలియదు కానీ..కోట్ల రూపాయల విలువ చేసే భూములను దక్కించుకునే విషయంలో ఈ ముగ్గురు మంత్రులు మాత్రం మంచి కో ఆర్డినేషన్ తో ముందుకు సాగుతున్నట్లు టీడీపీ వర్గాలు కూడా చెపుతున్నాయి. ప్రభుత్వంలో కీలక మంత్రి గా ఉన్న ఆయన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వచ్చే మదనపల్లి, పుంగనూరు ప్రాంతాలతో పాటు తిరుపతి జిల్లాలో కూడా 22 ఏ భూములతో పాటు ఇనాం, అసైన్డ్, చుక్కల భూముల వంటి వాటిపై ఫోకస్ పెట్టి దందా నడిపిస్తున్నారు.

                                   వివాదాస్పద భూములు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని కొంత మంది అధికారుల ద్వారా తెలుసుకుని మరీ ఆయన ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు అంటే ఆయన ఎంత ముదురో అర్ధం చేసుకోవచ్చు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొత్తం ముగ్గురు మంత్రులు ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకుంటూ కర్నూల్, నంద్యాల, చిత్తూర్, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప తదితర జిల్లాల్లో భారీ ఎత్తున భూ లావాదేవీలు నడిపిస్తున్నట్లు సచివాలయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కొంత మంది రెవిన్యూ శాఖ అధికారులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నట్లు చెపుతున్నారు. కోర్ట్ ఆదేశాలు ఉన్నాయని చెప్పి...లేకపోతే పై అధికారుల నుంచి ఆదేశాలు అని చెప్పి పలు జిల్లాల్లో కలెక్టర్లపై కూడా ఈ మంత్రులు రకరకాలుగా ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. 1954 నాటి భూముల రికార్డు లు తెర మీదకు తెచ్చి మరీ వీళ్ళు అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి అక్రమ మార్గాల్లో తమ పనులు పూర్తి చేయించుకుంటున్నారు. దీని కోసం ప్రత్యేక టీం లను ఈ మంత్రులు ఏర్పాటు చేసుకున్నట్లు చెపుతున్నారు.

Tags:    

Similar News