తెర వెనక చక్రం తిప్పుతున్న ముగ్గురు మహిళలు!

Update: 2025-11-23 04:01 GMT

ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార తెలుగు దేశం పార్టీ నాయకులు సీఎంఓ లోని ఆ ఐఏఎస్ కు చెప్పి తమ పనులు..పార్టీ సానుభూతిపరుల పనులు కూడా చేయించుకోలేరు. కానీ వైసీపీ కి చెందిన వాళ్ళ పనులు మాత్రం ఆ ఐఏఎస్ కు చెపితే చాలు ఎంతో వేగంగా..ఈజీ గా అయిపోతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార టీడీపీ నేతల్లో కలకలం రేపుతోంది. బిల్లుల చెల్లింపుతో తో పాటు ఇతర పనులను ఆ ఐఏఎస్ ఎంతో సులభంగా వైసీపీ నేతలకు చేసి పెడుతున్నారు అని తేలినట్లు టీడీపీ కి చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఒక నివేదిక రూపంలో కీలక నేత వద్దకు చేరింది అని...అయన కూడా దీనిపై ఆరా తీసినట్లు మరో ఐఏఎస్ అధికారి వెల్లడించారు. వైసీపీ వాళ్లకు పెద్ద ఎత్తున పనులు చేసిపెడుతున్న ఆ ఐఏఎస్ అధికారికి మంచి కళాకారుడు అనే పేరుంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పనులు చేయించుకుంటున్న వైసీపీ నేతలు ఎవరూ కూడా ఆయనతో నేరుగా టచ్ లో కూడా లేరు. కానీ వీళ్ళ పనులు ఎలా అయిపోయాయి అనుకుంటున్నారా?. అసలు విషయం అక్కడే ఉంది మరి.

                                         ఆ ఐఏఎస్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు మహిళలే ఈ కథ అంతా నడిపించారు అని తేలటంతో అవాక్కు అవటం టీడీపీ నేతల వంతు అయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న దాఖలాలు లేవు అని చెపుతున్నారు. వాస్తవానికి కొద్ది నెలల క్రితం జరిగిన బదిలీల్లో సీఎంఓలో పని చేస్తున్న ఈ ఐఏఎస్ పై కూడా వేటు పడాల్సి ఉంది. కానీ తెర వెనక జరిగిన సెటిల్మెంట్ లో భాగంగా వదిలేశారు అని...త్వరలోనే ఆయనపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది అని కూడా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక స్థానంలో ఉన్న ఆయన్ను బదిలీ చేస్తే భవిష్యత్ లో ఏమైనా తలనొప్పులు వస్తాయా అనే కోణంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు చెపుతున్నారు.

                                              ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఆ ఐఏఎస్ తన సోదరుడికి సమాచారం హక్కు చట్టం కమిషనర్ (ఆర్ టిఐ) పోస్ట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్లు చెపుతున్నారు. తన సన్నిహిత మహిళలు చెప్పిన పనులు చేసిపెట్టడమే కాదు. ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రితో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన..మరి కొంత మంది అధికారులు కలిసి ఒక సిండికేట్ గా కూడా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వీళ్ళు అంతా కలిసి ఎవరి పనులు వాళ్ళు చేయించుకుంటున్నట్లు చెపుతున్నారు. ఆ ఐఏఎస్ వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతల్లో పెద్ద కలకలమే రేపుతోంది. టీడీపీ నాయకులు..క్యాడర్ లో కూడా ప్రభుత్వంలో పనులు అన్ని వైసీపీ ముద్ర ఉన్న పారిశ్రామికవేత్తలు..కాంట్రాక్టర్ల కే అవుతున్నాయనే తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది విషయాన్ని చాలా మంది సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు తోడు సీఎంఓ లో ఐఏఎస్ అధికారి కూడా వైసీపీ వాళ్ళ కోసం పని చేస్తున్నారు అనే అంశం ఇప్పుడు బయటకు రావటంతో ఇది మరింత దుమారం రేపే అవకాశం ఉంది.

Tags:    

Similar News