ఏపీలో రైతులకు రెండవ విడత రైతు భరోసా నిధులు అందాయి. రాష్ట్రంలో 50.47 లక్షలకు దీని ద్వారా ప్రయోజనం లభించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని తాడేపల్లి లోని తన క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించారు. ఈ విడతలో రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 అందిస్తున్నాం. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో 4వేలు, సంక్రాంతికి రూ.2వేలు సాయం అందిస్తున్నాము. ఇప్పటికే మే నెలలో ముందస్తుగా రూ.2వేలు సాయం చేశాం.
ఈరోజు మరో రూ.2వేలు రైతు భరోసా సాయం అందిస్తున్నాం. గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నాము. ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో 50శాతం మంది రైతులు 1.25 ఎకరా లోపు ఉన్నవారే. పెట్టుబడి సాయంతో మెరుగైన భద్రత, ఉపాధి లభిస్తుంది. తొలిసారిగా ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ఖరీఫ్‌లోనే చెల్లిస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు.. ఖరీఫ్ సీజన్‌లోనే ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించడం ఇదే తొలిసారి. 1.66 లక్షల మంది రైతులకు 135.7 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం' అని తెలిపారు.