అసెంబ్లీకి వెళ్లి సభలోకి వెళ్లని ఉప ముఖ్యమంత్రి!

ఏమి సంకేతాలు పంపుతున్నట్లు !

ఒక పార్టీ అధినేతకు రాష్ట్రంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి పదవి పై ఆశ ఉండటం తప్పేమి కాదు. కానీ ఆ దిశగా ఆ నాయకుడు ఎలా పని చేస్తున్నాడు అన్నది కూడా ఎంతో ముఖ్యం . జనసేన అధినేత సంగతి ఏమో కానీ...అయన అభిమానులు ..జనసేన నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు . ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణలు చూసుకుంటే వచ్చే పదేళ్లలో కూడా సొంతంగా పోటీ చేసి జనసేన తరపున కీలక పదవి దక్కించుకోవటం జరిగే పని కాదు. లేదు అంటే ఎవరూ ఊహించని అద్భుతాలు జరగాలి. ప్రస్తుతానికి ఆ ఛాన్సులు ఎక్కడా కూడా కనిపించటం లేదు. కూటమిలో ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యవహరిస్తున్న తీరు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలే.

                                 ముఖ్యమంత్రి తర్వాత సాంకేతికంగా రెండవ స్థానంలో అంటే ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ పదే పదే కాబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటం...అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావటం వంటివి తీవ్ర చర్చనీయంగా మారుతున్నాయి. పైగా కీలక సీటు టార్గెట్ చేసుకునే నాయకుడు ఎవరైనా చేసే పనులు ఇలాగేనా చర్చ కూడా సాగుతోంది. గురువారంతో ముగిసిన అసెంబ్లీ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాల పేరు చెప్పి హాజరు కాలేదు . నిజంగా అనారోగ్యం అయితే దాన్ని ఎవరూ తప్పుపట్టరు కూడా. కానీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకుని వెళ్లిపోయారు కానీ...ఆయన సభలోకి అడుగుపెట్టలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు శాసనసభపై ఎంత గౌరవం ఉందో తెలుసుస్తుంది అన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి గా ఉన్న ఆయన సభ జరుగుతున్నట్లు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి సభలోకి వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలతో అదే ప్రాంగణంలో సమావేశం పెట్టుకుని ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారో అర్ధం కావటం లేదు అని ఒక జనసేన నాయకుడే వ్యాఖ్యానించారు.

                                మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లో ఏ మాత్రం బాధ్యతలు లేకుండా పవర్ తో పాటు ఎన్నో విధాలుగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న ఏకైక నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ అన్నది అత్యంత కీలకమైన శాఖ. అయినా కూడా ఆయన ఒక సారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఇంచుమించు మొత్తం సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇలా అసెంబ్లీ సమావేశాలు..క్యాబినెట్ మీటింగ్ లు , కలెక్టర్ల సమావేశాలకు హాజరు కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు...ఏదైనా కారణంతో కూటమి నుంచి బయటికి వెళ్లి తనకు, తన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయమని పవన్ కళ్యాణ్ అభ్యర్థిస్తే ...ఇలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఏమైనా లాభం ఉంటుందా అన్న ఆలోచన ప్రజలకు రాదా అన్న చర్చ జనసేన ఎమ్మెల్యేల్లోనే సాగుతోంది. మరో వైపు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమి చేసినా కూడా ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఇది మొత్తం మీద టీడీపీ కంటే జనసేనకు...ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా భారీ నష్టం చేస్తుంది అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. పవన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండి కూడా సినిమాల్లో లాగా ఒక్క మాటతో అంత సెట్ అవుతుంది అనే ఫీలింగ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది అని ఆయన్ను దగ్గర నుంచి చూస్తున్న ఒక నాయకుడు వ్యాఖ్యానించారు.

Full View

Tags: