విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి కీలక అడుగు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమనాశ్రయం వరకూ మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నవంబర్ మొదటి వారంలో డీపీఆర్ ప్రభుత్వం చేతికి వస్తుందని..ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. దసరా పండగను పురస్కరించకుని ఆదివారం నాడు విశాఖపట్నంలో మెట్రో రైలు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్ససత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీపీఆర్‌లపై కన్సల్టెంట్లతో చర్చలు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్ధేశంతో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 'మొదట గాజువాక నుంచి కొమ్మాది వరకూ మెట్రో అనుకున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న అవసరాల దృష్ట్యా మెట్రో దూరాన్ని పెంచమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెట్రో రైలు స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ దూరం పెంచి డీపీఆర్ తయారు చేస్తున్నాం. విశాఖ మెట్రోకు కేంద్ర సహాయ సహకారాలు అవసరం. విశాఖను దేశంలో గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలని చూస్తునాం' అని అన్నారు. మెట్రో రైల్‌ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లైట్ మెట్రోతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ట్రాఫిక్ పెరిగే కొద్దే కోచ్‌లు పెంచుకోవచ్చని, లైట్ మెట్రోకు కిలోమీటర్‌కు 200 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందని తెలిపారు.