ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్ళే విమానంలో సాంకేతిక సమస్యలు రావటంతో గంటల కొద్దీ ఈ విమానాన్ని గాల్లోనే తిప్పారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాతోపాటు సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామక్రిష్ణుడు తదితరులు ఉన్నారు. మొత్తం డెబ్బయి మందితో ప్రయాణిస్తున్న ఈ విమానంలో రేణిగుంటలో దిగాల్సి ఉండగా..బెంగుళూరు తీసుకెళ్లారు. అక్కడ విమానం సేఫ్ గా ల్యాండ్ కావటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇండిగో విమాన సర్వీసుపై రోజా మండిపడ్డారు. కారణాలు చెప్పకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని..ఇండిగోపై కేసు వేస్తానన్నారు.
విమానం ల్యాండ్ కాకపోవటానికి వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయం లో స్పష్టత ఇవ్వలేదని యనమల మండిపడ్డారు. ఇండిగో సిబ్బంది సమాధానం పై ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగుళూరులో ల్యాండ్ అయిన ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి ఇండిగో సిబ్బంది అదనపు రుసుము డిమాండ్ చేయటంతో వివాదం చెలరేగింది. సాంకేతిక సమస్య పేరుతో రేణిగుంటలో దిగాల్సిన విమానాన్ని బెంగుళూరులో ల్యాండ్ చేయటమే కాకుండా అదనపు డబ్బులు డిమాండ్ చేయటం ఏమిటి అని కొంత మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరు నుంచి తమ గమ్య స్థానాలకు చేరేందుకు ప్రయాణికుల సొంత ఏర్పాట్లు చేసుకున్నారు.