Full Viewఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా ఇప్పుడు ఏమి చెబుతారు?. చంద్రబాబునాయుడి హయాంలో చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటారా.. లేక ఇప్పుడు తన వైఖరి మార్చుకుంటారా?. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆ పార్టీ తరపున రోజా చాలా విమర్శలే చేశారు. అవన్నీ ఒకెత్తు అయితే ఈ వ్యాఖ్యలకు మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ డబ్బుతో పథకాలు అమలు చేస్తూ అదేదో చంద్రబాబు తన తండ్రి ఖర్జూరనాయుడు ఆస్తి తీసుకొచ్చి అమలు చేస్తున్నట్లు తన సొంత పేర్లు ఎలా పెట్టుకుంటారు అని ప్రశ్నించారు రోజా అప్పట్లో. అంతే కాదు..మంచి పాలన అందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇది అంటూ విమర్శలు గుప్పించారు. దివంగత నేతల పేర్లు పెట్టుకుంటారు కానీ ఇలా చేస్తారా అని రోజా ప్రశ్నించారు. సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా చెప్పిన మాటలకు పూర్తి భిన్నమైన వాతావరణం వచ్చింది.
ఏపీలో ఇప్పుడు జగనన్న పథకాల పరంపర సాగుతోంది. చంద్రబాబు జమానా కంటే మించి ఇప్పుడు ఏపీలో జగన్ పేరుతో పథకాలు పెట్టారు. తొలుత జగనన్న పేరు ఓ పథకానికి పెడుతూ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు జగన్ కు ఇష్టం లేకపోయినా తాము ఒత్తిడి చేయటం వల్లే ఒప్పుకున్నారని ప్రకటించారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవంలేదని తర్వాత వరస పెట్టి పలు పథకాలకు జగన్ పేరు పెడుతూ పోతున్నతీరుతో స్పష్టం అయిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు జమానా కంటే జగన్ పేరుతోనే ఎక్కువ పథకాలు అమలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి రోజా ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. రాజకీయంగా ఇది ఆమెకు ఒకింత ఇబ్బందికర వాతావరణం కల్పించటం ఖాయం.