త్వరలో జనసేనలోకి ఉదయభాను..కిలారి రోశయ్య?!

Update: 2024-09-18 15:03 GMT

Full Viewవైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సన్నిహితుడు, బంధువు అయిన బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీకి రాజీనామా చేయటంలో వైసీపీ లో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఇప్పటికే కొంత మంది నేతలు వైసీపీ ని వీడారు. అందులో ఇద్దరు రాజ్య సభ సభ్యులు కూడా ఉండటం విశేషం. కొద్ది రోజుల క్రితమే ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు లు రాజ్య సభ సభ్యత్వంతో పాటు వైసీపీ కి రాజీనామాలు చేశారు. బుధవారం నాడు మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ ని వీడ కుండా చేసేందుకు జగన్ చివరివరకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇటీవలే మాజీ మంత్రి విడదల రజని తో పాటు మరికొంత మంది నేతలు హైదరాబాద్ లో బాలినేని తో భేటీ అయ్యారు. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వైసీపీ కి గుడ్ బై చెప్పిన బాలినేని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన లో చేరటానికి సిద్ధం అయ్యారు. బాలినేని గురువారం నాడు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయి చేరిక తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే వైసీపీ కి చెందిన నేత ఉదయభాను, కిలారి రోశయ్య లు కూడా త్వరలోనే జనసేన లో చేరే అవకాశం ఉంది ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

                                                             అయితే వీరిద్దరి చేరికకు సంబంధించి ఆయా నేతలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే బాలినేని చేరిక తర్వాత వీరి ఎంట్రీ ఉండొచ్చు అని జనసేన వర్గాలు చెపుతున్నాయి. ఇదే నిజం అయితే మాత్రం రాజకీయంగా ప్రస్తుతం కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన ల మధ్య రాజకీయ వివాదాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాప్ లెవెల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఎంత సఖ్యతతో ఉన్నా కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితిలో గందరగోళం ఏర్పడితే రాబోయే రోజుల్లో ఇది రెండు పార్టీలకు నష్టం చేసే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది. ప్రధానంగా జగన్ తీరుతోనే ఎక్కువ మంది నేతలు వైసీపీ భవిష్యత్ పై ఆందోళనతో ఉన్నారు. ఈ కారణంగానే రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీ నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఒక్కసారి కూడా ఓటమికి గల కారణాలపై వాస్తవాలను గుర్తించటానికి సిద్ధంగా లేకపోవటమే వైసీపీ కి రాబోయే రోజుల్లో పెద్ద సవాల్ గా మారే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Tags:    

Similar News