సంతకాల శిక్ష వాళ్లకు అవమానమే!

Update: 2024-08-14 12:43 GMT

Full Viewప్రభుత్వంలో భాగంగా ఉండే ఐఏఎస్ లు..ఐపీఎస్ లు అర్హులకు మేలు కలిగేలా మంచి పనులు చేస్తే వాళ్ళను ప్రజలు పది కాలాలపాటు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి అధికారులు చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఇది అంతా గతం. ఇప్పుడు చాలా మంది అధికారులు ప్రభుత్వంతో కంటే...ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కోసం...ఆ పార్టీ అధినేత కోసం పని చేసినట్లు వ్యవహరిస్తూ పోతున్నారు. చాలా మంది ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు ఇలాంటి ముద్రలు ఎప్పటి నుంచో పడుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత పెరుగుతూ పోతోంది. తాజాగా కొంత మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు అనధికారికంగా ఎక్కడెక్కోడో తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇక అలా కుదరదు అంటూ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తాజాగా ఒక మెమో జారీ చేశారు. ఇక్కడ వెరైటీ ఏంటి అంటే ఇలా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు అందరూ గత జగన్ సర్కారు లో ఒక వెలుగు వెలిగిన వాళ్లే కావటం. ఒక్క మాటలో చెప్పాలంటే వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు డీజీపీ షాక్ ఇచ్చారు.

                                                                         గత కొంత కాలంగా వెయిటింగ్ లో ఉన్న ఈ అధికారులు అందరూ ఇక నుంచి విధిగా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండటంతో డీజీపీ ఆఫీస్ లో వెయిటింగ్ లో ఉండాలని స్పష్టం చేశారు. ఉదయం ఆఫీస్ కు రావటం తో పాటు సాయంత్రం కూడా ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత రిజిష్టర్ లో సంతకం చేసి వెళ్లాలని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. మొత్తం పదహారు మంది సీనియర్ ఐపీఎస్ లకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఇందులో పీఎస్ ఆర్ ఆంజనేయులు, పీ వి సునీల్ కుమార్, ఎన్ .సంజయ్, కాంతి రానా టాటా, జీ. పాల రాజు , కొల్లి రఘురామిరెడ్డి, ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, సి హెచ్ విజయరావు, విశాల్ గున్ని, అన్బురాజన్ , వై .రవిశంకర్ రెడ్డి, వై. రిషాంత్ రెడ్డి, కె . రఘువీరారెడ్డి, పీ. పరమేశ్వర్ రెడ్డి, పీ. జాషువా, కృష్ణకాంత్ పటేల్ లు ఉన్నారు. తాజాగా డీజీపీ జారీ చేసిన ఆదేశాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారాయి. గత జగన్ సర్కారులో నిబంధలు పక్కన పెట్టి ఇష్టానుసారం వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అంటూ కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఐపీఎస్ లకు డీజీపీ ఆఫీస్ లో ప్రతి రోజూ వెయిటింగ్ ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News