వేల కోట్లు చేతులు మారుతున్నా చూసీచూడనట్లు వదిలేస్తారా?!

Update: 2024-09-18 04:25 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర. ఒకప్పుడు ఆయన ఇసుక అక్రమాలపైనే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు అనే చర్చ అటు రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి వంటి కీలక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో జరిగే కీలక నిర్ణయాలకు జవాబుదారిగా కూడా ఉండాల్సి ఉంటుంది. అంతే కాదు..టీడీపీ తరహాలోనే జనసేన కూడా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా జనసేన పీఏసి సభ్యుడు, ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రతిపక్షంలో ఉండగా జగన్ సర్కారు అప్పటి సీఎం కు ఎంతో సన్నిహితం అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కు మేలు చేసేలా పారిశ్రామిక విధానం రూపొందించారని విమర్శించారు. ఇది అంతా అస్మదీయ కంపెనీలకు మేలు చేసి పెట్టడానికి అన్నారు. తొలుత ఇండోసోల్ సంస్థకు రామాయపట్నం పోర్టు దగ్గర 5 ,148 ఎకరాలు లీజ్ కు ఇచ్చారు అని..కొత్త పారిశ్రామిక విధానం తెచ్చిన తర్వాత భూమిపై హక్కులు కల్పించారు అని నాదెండ్ల ఆరోపించారు.

                                                                                           ఇది ఒక్కటే కాదు..ఈ సంస్థతో పాటు షిర్డి సాయి కంపెనీ కి కూడా వివిధ ప్రాజెక్ట్ ల కోసం ఆంధ్ర ప్రదేశ్ లో వేల ఎకరాల భూములు కట్టబెట్టారు. ఈ కేటాయింపులను అప్పటిలో టీడీపీ తో పాటు జనసేన కూడా వ్యతిరేకించింది..తప్పుబట్టింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం విమర్శలు చేసిన సంస్థలను...అది కూడా మాజీ సీఎం జగన్ కు ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు పేరున్న కంపెనీలతో కూటమి ప్రభుత్వంలో ఒక యువ మంత్రి వేల కోట్ల రూపాయల డీల్ చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనికోసమే గతంలో జరిగిన ఒప్పందాలను టచ్ చేయబోమని చెపుతున్నారు అనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచి కూడా వస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ కానీ..ఇటు నాదెండ్ల మనోహర్ కానీ ప్రతిపక్షంలో ఉండగా విమర్శలు చేసి...ఇప్పుడు ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్నారు అంటే..ఇందులో జనసేన కు కూడా భాగం ఉంది అనే అనుమానాలు రాక మానవు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ కి చెందిన ముఖ్య నేతలు జగన్ ప్రాయోజిత కంపెనీలతో లాలూచీపడ్డ చందంగానే..ఇప్పుడు జనసేన కూడా టీడీపీ తో ఈ వ్యవహారంలో లాలూచీ పడిందా...లేక నోరువిప్పుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

                                                                 టీడీపీ నాయకుల్లోనే దుమారం రేపుతున్న ఈ అంశంపై మరి పవన్ కళ్యాణ్ ఇప్పటిలాగానే చూసి..చూడనట్లు వదిలేస్తారా, లేక దీనిపై స్పందిస్తారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. గత ప్రభుత్వంలో జరిగిన భారీ అక్రమాలపై ఇప్పుడు సెటిల్ మెంట్స్ చేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఆశ్రయిస్తే జనసేన కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది అనే అనుమానాలు రాక మానవు అని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీ లో సంచలనం రేపుతున్న జగన్ ప్రాయోజిత కంపెనీలతో వేల కోట్ల రూపాయల సెటిల్మెంట్ విషయంపై మాట్లాడకపోతే అందరికి ఇందులో భాగం ఉంది అనే అభిప్రాయం ప్రజల్లో కలగటం ఖాయం. సహజంగా కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వంపై ఇంత త్వరగా ఇలాంటి ఆరోపణలు రావు. కానీ విచిత్రం ఏమిటి అంటే అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాకముందే గత ప్రభుత్వంలో జరిగిన అనేక స్కాం లకు సంబంధించి సెటిల్మెంట్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు వెనకేసుకునే స్కెచ్ వేయటం అంటే మాములు విషయం కాదు. కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న యువ నేత తన ఫోకస్ అంతా ఇలాంటి వాటిపైనే పెట్టినట్లు టీడీపీ వర్గాలు కూడా చెపుతున్నాయి.

Tags:    

Similar News