రైతులు ...ప్రజలు, పారిశ్రామికువేత్తలు డబ్బులు కట్టాల్సిందే !

Update: 2025-04-09 09:25 GMT
రైతులు ...ప్రజలు, పారిశ్రామికువేత్తలు   డబ్బులు కట్టాల్సిందే !
  • whatsapp icon

కెసిఆర్ మోడల్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు

వరద జలాలపై 80112 కోట్ల పెట్టుబడి గ్యాంబ్లింగ్ అంటున్న అధికారులు

అమ్మకానికి గోదావరి వరద జలాలు. రైతుల దగ్గర నుంచి మొదలు ప్రజలకు, పరిశ్రమలకు సరఫరా చేసే నీళ్లు కూడా అమ్ముతాం అని చెపుతారు. అది చూపించే బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొస్తారు. తాము అనుకున్న పని పూర్తి చేసుకుంటారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం విషయంలో ఎలాంటి మోడల్ ను ఫాలో అయ్యారో అచ్చం అదే మోడల్ ఫాలో అవ్వటానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రెడీ అయ్యారు. రైతులు..ప్రజలు..పారిశ్రామిక అవసరాలకు నీళ్లు విక్రయించి ఎనభై వేల కోట్ల రూపాయలు పైగా వెచ్చించి కట్టాలని ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్ట్ అప్పులు తీర్చటం సాధ్యం అయ్యే పనేనా అంటే...ఎప్పటిలాగానే సాగు పెరగటం...పంట దిగుబడి వంటి లెక్కలు చెపుతారు. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళ లెక్కలే నమ్మాలంటారు.

                                                           ఎక్కడ వరకో ఎందుకు ఎన్నికల ముందే కెసిఆర్ ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు పైగా వెచ్చించి కట్టిన కాళేశ్వరం డబ్బులు ఇప్పటికే వెనక్కి వచ్చేశాయని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. బనకచెర్ల ప్రాజెక్ట్ అమలు కోసం ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం నాడే జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఈక్విటీ తో పాటు బ్యాంకు లు ..ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూర్చుకుని ప్రాజెక్ట్ ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎస్పీవి ద్వారా పబ్లిక్ మార్కెట్స్ నుంచి నిధులు సమీకరించే అవకాశం ఉంది అని తెలిపారు. అయితే కేవలం వరద జలాలపై ఆధారపడి ఒక రాష్ట్రం ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం ఏ మాత్రం సరికాదు అని ఎక్కువ మంది చెపుతున్న మాట.

                                        ప్రాథమిక అంచనాల ప్రకారం బనకచెర్ల ప్రాజెక్ట్ వ్యయం 80,112 కోట్ల రూపాయలుగా జీవో లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కి పూర్తి అయ్యే నాటికీ ఇది ఇంతకు చేరుతుందో ఎవరికీ తెలియదు. కేవలం వరద జలాలపై ఆధారపడి ఈ ప్రాజెక్ట్ తలపెట్టడం గ్యాంబ్లింగ్ తప్ప మరొకటి కాదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి గోదావరి నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు సముద్రంలో కలుస్తున్న మాట నిజమే అయినా కూడా వాతావరణంలో ఎంతో వేగంగా మార్పులు వస్తున్న తరుణంలో వరద జలాలపై ఇంత భారీ పెట్టుబడితో కూడిన ప్రాజెక్ట్ చేపట్టడం ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అని ఆయన వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా కొత్తగా ఏడున్నర లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అని...80 లక్షల మందికి తాగు నీరు అందుతుంది అని పేర్కొన్నారు. వీటితో పాటు మరో మరికొంత స్థిరీకరణ కూడా సాధ్యం అవుతుంది అని తెలిపారు.

                                        కొత్తగా ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ చేపట్టే బదులు రాష్ట్రంలో ఇప్పటికే మొదలు పెట్టిన సాగునీటి ప్రోజెక్టుల పనులు పూర్తి చేయటం మేలు అన్నది ఎక్కువ మంది చెప్పే మాట. ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 86 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే 56961 కోట్ల రూపాయల వ్యయం చేశారు. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లపై మరో 1 ,16 ,405 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కొత్తగా 37 . 51 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో మరో 48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని జలవనరుల శాఖ లెక్కలే చెపుతున్నాయి. ఎలా చూసుకున్నా బనక చెర్ల కంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లు చేపట్టడమే బెస్ట్ అన్నది ఎక్కువ మంది మాట.

Tags:    

Similar News