నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్ళు ప్రారంభం

Update: 2020-10-20 12:24 GMT

ఏపీలో కరోనా కేసులు ఈ మధ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య నాలుగు వేల లోపుకు వచ్చేసింది. ఈ తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అన్ని క్లాస్ లు ఒకేసారి కాకుండా..క్లాస్ ల వారీగా విభజించి షెడ్యూల్ ఖరారు చేశారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.

రెండు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నవంబర్‌ నెలలో ఇది అమలవుతుందని, డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News