ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత కీలకమైన సమాచార, పౌరసంబంధాల శాఖ వ్యవహారాలు అన్నీ ఐఏఎస్ అధికారులే పర్యవేక్షించే వారు. కానీ రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పరిస్థితి మారింది. చంద్రబాబునాయుడు హయాంలోనూ నాన్ ఐఏఎస్ లే సమాచార శాఖలో చక్రం తిప్పగా...ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనూ అదే జరుగుతోంది. అంతే కాదు గతంలో ఎన్నడూలేని రీతిలో మీడియాకు అత్యంత సాదారణంగా ఇచ్చే అక్రిడేషన్ల వ్యవహారం కూడా రచ్చరచ్చగా మారుతోంది. ఇక పత్రికా ప్రకటనల విషయానికి వస్తే ఎవరు అధికారంలో ఉంటే వారి అస్మదీయులకే సింహభాగం. చంద్రబాబు హయాంలో సమాచార శాఖ ఖర్చుకు సంబంధించి కాగ్ అభ్యంతరాలు..అప్పటి కమిషనర్ల వివరణలు సాగాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే సీన్ రిపిట్ కావటం ఖాయం అని అని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రకటనల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సాక్షి పత్రికకే సింహభాగం వాటా వెళుతోంది. సాంకేతికపరంగా చూస్తే ప్రథమ స్థానంలో ఉన్న పత్రికకంటే రెండవ స్థానంలో ఉన్న పత్రికకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కన్పిస్తోందని..ఇది రాబోయే రోజుల్లో కమిషనర్ తోపాటు సమాచార శాఖ అధికారుల మెడకు కూడా చుట్టుకోవటం ఖాయం అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఐఏఎస్ లు అయితే ఇలా తాము చెప్పినట్లు చేయరనే ఉద్దేశంతోనే ప్రభుత్వంలో ఉన్న వారు అస్మదీయులను తెచ్చిపెట్టుకుని తమకు నచ్చిన విధంగా పనులు చేయించుకుంటున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఓ మీడియా సంస్థ ఉండటం..గతంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు అక్రిడేషన్లలోనూ కోతలు విధించటం మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. ఓ వైపు సర్కారు తమది దేశంలోనే అత్యంత సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ అక్రిడేషన్ల వంటి చిన్న చిన్న విషయాల్లో దారుణంగా అప్రతిష్ట మూటకట్టుకుంటోందని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. సమాచార శాఖ పరిస్థితి ఎంత విచిత్రంగా ఉంది అంటే ప్రభుత్వం ఓ వైపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చెబుతున్న విశాఖపట్నంలోనూ గతంలో ఇచ్చిన వాటి కంటే కోత పెట్టి మరీ అక్రిడేషన్లు ఇవ్వటం జర్నలిస్టు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు జాతీయ మీడియాకు ఇచ్చే ప్రకటనల విషయంలోనూ కొంత మంది అధికారులు భారీ ఎత్తున కమిషన్లు దండుకుంటున్నారనే విమర్శలు ఆ శాఖ వర్గాల నుంచే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అయితే ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యకార్యదర్శులతో సంబంధం లేకుండా పలు శాఖలకు సంబంధించిన పత్రికా ప్రకటనలు, సీఎం జగన్ సమీక్షల వివరాలు కమిషనర్ విజయకుమార్ రెడ్డి పేరు మీద..ఆయన ఫోటోతో కూడా పంపించటం కూడా అధికార వర్గాల్లో దుమారం రేపింది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు కమిషనర్ కూడా పూర్తి అండదండలు అందిస్తున్నారు. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కూడా ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవటంలేదనే అధికార వర్గాలు చెబుతున్నాయి.