మద్యం విషయంలో జగన్ సర్కారు 'రివర్స్ గేర్'

Update: 2020-10-29 12:17 GMT

రేట్లు పెంచింది నియంత్రణకు..తగ్గించింది మద్యపాన ప్రోత్సాహనికా?

మాట తప్పం...మడమ తిప్పం డైలాగ్ కు కాలం చెల్లినట్లు ఉంది. మందు ముట్టుకుంటే కాలిపోవాలి అన్న తరహాలో వరసగా మద్యం రేట్లు పెంచిన జగన్ సర్కారు ఇప్పుడు ధరల విషయంలో రివర్స్ గేర్ వేసింది. మద్య నిషేధం, నియంత్రణలో భాగంగానే ధరలు పెంచామని సమర్ధించుకున్న సర్కారు ఇప్పుడు సీన్ మార్చింది. ప్రీమియం, మధ్యతరహా బ్రాండ్ల ధరలను గణనీయంగా తగ్గించింది. అప్పుడు రేట్లు పెంచినప్పుడు చెప్పింది ఏంటి అంటే మద్య నియంత్రణ కోసమే అని. మరి ఇప్పుడు ధరలు తగ్గించటం అంటే మధ్యాన్ని సర్కారు ప్రోత్సహిస్తున్నట్లుగా భావించాలా? లేక పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారా?.

ప్రభుత్వం బెల్ట్ షాపులను తీసేసినా పలు చోట్ల నాటుసారాతోపాటు అక్రమ మద్యం ప్రవేశించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఏపీలో రేట్లు మరీ ఎక్కువగా ఉండటం, దీంతోపాటు బ్రాండ్లలో చాలా వరకూ ఎప్పుడూ వినని అనేకం వచ్చాయి. దీంతో చాలా మంది అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. ఇప్పుడు సర్కారు దిద్దుబాటు చర్యల్లో భాగంగా రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నాయి. పలు బ్రాండ్లపై ధరలను 50 రూపాయల నుంచి 1350 రూపాయల వరకూ తగ్గించారు.

Tags:    

Similar News