పెద్దల అండదండలు లేకుండా ఇది సాగుతుందా?!
అంచనాలు పెంచుకో..అందినంత దండుకో. ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పాటిస్తున్న మోడల్ అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ సారి కూటమి ప్రభుత్వంలో గతానికి భిన్నంగా పనులు సాగుతున్నాయి అనే అభిప్రాయం కొంత మంది మంత్రుల్లో కూడా ఉంది. విచిత్రం ఏమిటి అంటే ఇది అంతా కూడా ఇప్పుడు వ్యవస్థీకృతంగా సాగుతోంది అని చెపుతున్నారు. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనుల్లో అంచనాలు అడ్డగోలుగా పెంచారు అనే విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా పనుల కేటాయింపులో కూడా పోటీ తత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రభుత్వ పెద్దలు ఎవరికీ చెపితే వాళ్ళకే దక్కేలా డిజైన్ చేశారు...పనులు అప్పగించారు. వాస్తవానికి పనులు ఎక్కువ మందికి ఇచ్చి...ఎంత వేగంగా వీలు అయితే అంత వేగంగా పూర్తి చేయటంపై ఫోకస్ పెట్టాల్సింది పోయి...అతి తక్కువ మంది...తమకు కావాల్సిన వాళ్ళకే మాత్రమే ఇచ్చి ఇప్ప్పుడు వేగం పెంచాలని కాంట్రాక్టు కంపెనీలను ప్రాధేయ పడాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది.
ఇది ఇలా ఉంటే ఏపీ జెన్ కో అనంతపురం జిల్లా యాడికిలో నిర్మించనున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా 20 శాతం మేర పెంచినట్లు విద్యుత్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకునేందుకు కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి చెందిన మంత్రి ఒకరు తన తరపున లింగా టీంను రంగంలోకి దింపారు అని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎలాగైనా సరే ఈ 5000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ దక్కించేకునేందుకు ఒక మెగా కంపెనీని సైతం వెనక్కి నెట్టి వీళ్ళు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అంటే ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా ఇది సాగుతుందా అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు...ఐఏఎస్ అధికారులు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారో...లేక ప్రైవేట్ కంపెనీలు...కాంట్రాక్టర్ల కోసం పని చేస్తున్నారో అర్ధం కావటం లేదు అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఒక శాఖ మంత్రి దగ్గర పని చేసే ఓఎస్డీ ఏకంగా కార్పొరేట్ కంపెనీల కోసమే పని చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఆయన ప్రతి నిర్ణయం ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసేలా...ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేలా ఉంటున్నాయి అని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఏ పని ఎవరికీ ఇవ్వాలనే విషయాన్ని ఆయన టెండర్లు ఖరారు కాకముందే ఐఏఎస్ అధికారులకు చెప్పేస్తున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే చర్చ సాగుతోంది. ఇప్పుడు లింగా టీం కోసం ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అని విద్యుత్ శాఖలో ప్రచారంలో ఉంది.