గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలను పోలవరం అంశం కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. మీ వల్లే పోలవరానికి ఈ పరిస్థితి అని ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తుంటే ..వైసీపీ మాత్రం గతంలో చంద్రబాబు సర్కారు చేసిన తప్పిదాలే ఇప్పుడు పోలవరానికి శాపంగా మారాయంటూ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి ఈ అంశంపై లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, 2017-18 అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం 55,656.87 కోట్ల రూపాయలుగా ఉందన్నారు, నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించాలని ఏప్రిల్ 29, 2014 నాటి కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రాజెక్ట్ ఖర్చు పెరిగితే కేంద్రమే భరించాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని మే 8, 2017న కేంద్ర జలవనరుల శాఖ లేఖలో తెలిపింది. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమయ్యే కొద్ది అంచనాలు పెరిగిపోయాయి.
డిజైన్‌లో మార్పులు, కొత్త చట్టం ప్రకారం పునరావాసం, భూ సేకరణ, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న నిరు పేదలకు పరిహారం... వీటన్నింటి వల్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12,520 కోట్లు ఖర్చు పెట్టింది. కేంద్రం రూ.8,507కోట్లు చెల్లించింది, ఇంకా రూ.4,013 కోట్లు చెల్లించాల్సి ఉంది. అక్టోబర్ 12, 2020న కేంద్ర ఆర్థిక శాఖ కొత్త మెలిక పెట్టింది. ఇది విభజన చట్టంలో అంగీకరించిన దానికి పూర్తి విరుద్ధం. ఇప్పటికే రూ.17,656 కోట్ల ప్రజాధనం ప్రాజెక్టు కోసం వెచ్చించాం. ఈ సమయంలో కొత్త షరతులు తెస్తే ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోతుంది. భూసేకరణ, పునరావాసానికే భారీగా ఖర్చు కానుంది. ఇప్పుడు నిధుల జాప్యం చేస్తే అంచనా వ్యయం పెరుగుతుందని తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేసి 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయాలని జగన్ కోరారు.