ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో చేపట్టబోయే ఎనిమిది కీలక ప్రాజెక్ట్ లను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పీవి) కింద అమలు చేయనున్నారు. కంపెనీ చట్టాలకు అనుగుణంగా ఈ ఎస్ పీవి ని ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ మంగళవారం నాడు జీవో చేసింది. ఇందులోనే ఎస్ పీ వి కింద చేపట్టబోయే ప్రాజెక్ట్ లను ప్రస్తావించారు. దీని ప్రకారం అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తో పాటు ఎన్టీఆర్ స్టాట్యూ, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జి , స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వీటితో పాటు ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తించిన ప్రాజెక్ట్ లను కూడా దీని కిందకు తీసుకువస్తారు అని తెలిపారు. ఏపీసిఆర్ డీఏ లేదా ఎస్ పీవి సిఫారసుల ఆధారంగా ఎంపిక చేసిన సంస్థకు నేరుగా భూములు కేటాయిస్తారు.
అంతే కాదు ప్రాజెక్ట్ అమలు చేసేందుకు ఈ భూములను తనఖా పెట్టుకునేందుకు, నిధుల సమీకరణకు ఈ భూములపై హక్కులు కల్పించటానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది అని తెలిపారు. అదే సమయంలో ఈ విధానం కింద అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ల్లో టారిఫ్ లు, యూజర్ ఫీజు లు, రెవెన్యూ షేరింగ్ వంటి అంశాలు ఏపీసి ఆర్డీఏ తో కలిసి ఖరారు చేస్తారు. ఎస్ పీవి కిందే ప్రాజెక్ట్ ఫైనాన్స్ మోడల్ అంటే ఈక్విటీ , అప్పులు, గ్రాంట్స్, అవసరం అయిన చోట వయబిలిటీ గ్యాప్ ఫండింగ్( వీజీఎఫ్) వంటి అంశాలను నిర్ణయిస్తారు. ప్రతిపాదిత ప్రాజెక్ట్ లను పీపీపీ విధానం లేదా బిఓటి , హైబ్రిడ్ యాన్యుటీ , ఈపీసీ వంటి మోడల్స్ చేపడతారు అని జీవో లో పేర్కొన్నారు. అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ కింద భూ సమీకరణ ప్రతిపాదన తాత్కాలికంగా పక్కన పెట్టిన కూడా ఈ జీవో ప్రకారం చూస్తే ఎయిర్ పోర్ట్ తో పాటు స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్ట్ ల కోసం అదనపు భూ సమీకరణ తప్పదు అనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది అని చెప్పొచ్చు.