రెండేళ్లు పూర్తి కాకుండానే ఇద్దరు సిఆర్డీఏ కమిషనర్లు బదిలీ

Update: 2026-03-21 07:06 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఈ టర్మ్ లో అన్నా పూర్తి అవుతుందా?. ఇదే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఉన్న ఆందోళన. వాస్తవానికి గతంతో పోలిస్తే ఈ సారి కేంద్రం ఇప్పించిన అప్పుతో పాటు పలు అంశాలు అమరావతి వేగంగా పూర్తి కావటానికి వాతావరణం అంతా అనుకూలంగానే ఉంది. కాకపోతే విచిత్రంగా ప్రభుత్వం నుంచే ఈ సారి అమరావతి విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి అనే చర్చ టీడీపీ వర్గాల్లో కూడా సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని అంతా విజనరీ అని... రకరకాల పేర్లతో ప్రశంసిస్తూ ఉంటారు చాలా మంది టీడీపీ అభిమానులు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కాకముందే రాజధాని నిర్మాణానికి చెందిన అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఆథారిటీ (ఏపీ సిఆర్ డీఏ) కి ఇద్దరు కమిషనర్లు మారారు. ఇప్పుడు మూడో కమిషనర్ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నిజాయతీపరుడుగా పేరున్న ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ ను ఈ పోస్ట్ లో నియమించారు.

                                   కానీ ఆయన్ను అక్కడ ఎన్నో రోజులు ఉండనివ్వలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలు చెప్పినట్లు చేయటంలేదు అనే కారణంతోనే భాస్కర్ ను అక్కడ నుంచి తప్పించినట్లు టీడీపీ వర్గాల్లోనే ప్రచారంలో ఉంది. భాస్కర్ ను తప్పించిన తర్వాత మంత్రి నారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఐఏఎస్ అధికారి కన్నబాబు ను ఈ పోస్ట్ లో నియమించారు. అయితే గత కొన్ని రోజులుగా మంత్రి నారాయణకు, కన్నబాబు కు మధ్య తేడాలు వచ్చాయి అని ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సీఆర్ డీఏ పై గతంలో ఎన్నడూ లేనిరీతిలో రకరకాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో కన్నబాబును సి ఆర్ డీఏ నుంచి తప్పించి పౌరసరఫరాల శాఖకు బదిలీ చేశారు. కొత్త సీఆర్ డీ ఏ కమిషనర్ గా ప్రస్తుతం నారా లోకేష్ చూస్తున్న విద్యాశాఖ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు ని నియమించారు. ఇది మంత్రి నారాయణకు ఏదైనా సంకేతం పంపటమా అన్న చర్చ కూడా అధికార, రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

                                            వైసీపీ హయాంలో విజయరామరాజు కొంత కాలం కడప జిల్లా కలెక్టర్ గా కూడా పని చేశారు. అయితే ఆయన వర్కింగ్ స్టైల్ విషయంలో కన్నబాబు కు విజయరామరాజుకు పెద్ద తేడా ఉండదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే సమయంలో ఆయన మిగిలిన విషయాల కంటే కూడా కేవలం ప్రభుత్వ పెద్దలు చెప్పిన విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు అని చెపుతున్నారు. ఏపీసి ఆర్ డీఏ లాంటి కీలక పోస్ట్ లో తరచూ ఇలా అధికారులను మార్చటం ద్వారా ప్రభుత్వం తన పరువు తానే తీసుకుంటుంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే సమయంలో సీఆర్డీఏ కాంట్రాక్టు ల విషయంలో కూడా ఎంపిక చేసిన సంస్థలకు పెద్ద ఎత్తున పనులు కేటాయించారు అనే విమర్శలు ఉన్నాయి. అంతే కాదు బిల్డింగ్ ల దగ్గర నుంచి మొదలుపెడితే రోడ్లు..ఇతర పనుల్లో కూడా అంచనాలు అడ్డగోలుగా పెంచి ప్రభుత్వం ఖజానాకు చిల్లులు పెడుతూ అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున లబ్దిపొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సి ఆర్ డీఏ కమిషనర్ల బదిలీ వ్యవహారం ఇక్కడితో అయినా ఆగుతుందా ..లేక అలా సాగుతూనే ఉంటుంది అన్నది వేచిచూడాల్సిందే.

Full View

Tags:    

Similar News