మావిగన్ విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా సరే జగన్ మోహన్ రెడ్డి ఇక రాబోయే రోజుల్లో అదే విషయాన్ని పట్టుకుని ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఇదే స్పష్టం అవుతోంది. మరో వైపు గురువారం నాడు తాడేపల్లి లోని జగన్ నివాసం దగ్గర వెలిసిన ఫ్లెక్సీలు...పోస్టర్లు కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెపుతున్నాయి. రాజధాని విషయంలో జగన్ ఇప్పటికే ఎన్నో సార్లు మాట మార్చితే జగన్ ఇంటి ముందు కట్టిన ఫ్లెక్సీల్లో మాత్రం వన్ పార్టీ....వన్ ఫ్లాగ్, వన్ ఎజెండా మావిగన్ 2029 రాసుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అంటూ మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర సమగ్రాభివృద్ధి విషయాన్ని పక్కన పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లను కలిపి మావి గన్ అనే కొత్త స్లోగన్ అందుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయి కూటమి భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి తిరిగి పట్టాలు ఎక్కుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. పైగా కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ లు కూడా ఒక రాష్ట్రం..ఒకే రాజధాని అనే నినాదంతో ఉన్నవే. అమరావతి కంటే తాను ప్రతిపాదించిన మావిగన్ ప్లాన్ వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో జగన్ మోహన్ రెడ్డి అమరావతి పనులు పట్టాలు ఎక్కుతున్న సమయంలో చెప్పి ఉంటే కొంతలో కొంత జగన్ కు విశ్వసనీయత వచ్చి ఉండేది. కానీ అమరావతి కి చట్టబద్దత కల్పిస్తున్నారు అనే విషయం బయటకు వచ్చే వరకు జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో తీసుకున్న మూడు రాజధానుల నినాదం వదిలేశారా లేదా అన్నది కూడా ఎవరికీ తెలియదు. కానీ అమరావతికి అంతా లైన్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే జగన్ ఈ స్లోగన్ అందుకోవటంతోనే జగన్ ఎజెండా ఏంటి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ చెప్పే మావిగన్ మాటలను ప్రజలు ఎంత మేర నమ్ముతారు అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.