హైదరాబాద్ ను తాకిన యూపీ సెగలు

Update: 2020-10-01 15:54 GMT

యూపీ సెగలు హైదరాబాద్ కు తాకాయి. ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ లో జరిగిన గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కిందపడిపోయారు. దీంతో కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. హైదరాబాద్ లో తొలుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అనిల్ యాదవ్ తదితరులతో కలసి బిజెపి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో పోలీసులు ప్రవేశించి రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

మరో వైపు హథ్రాస్‌ హత్యాచార ఘటనకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ నిర్వహించారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డగించారు. మరోవైపు కాంగ్రెస్‌ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించగా, ఆ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌ వైపు దూసుకెళ్లారు. రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీ ప్రదర్శనలతో గాంధీభవన్‌, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

 

Similar News