ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ కి ఫిర్యాదు
అధికారంలోకి వచ్చాక చర్యలు లేనట్లేనా అన్న చర్చ
గత బిఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ లోని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను తెగనమ్మిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో లబ్దిపొందానికి ..రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల దీర్ఘకాలిక అవసరాల కోసం ఉంచాల్సిన భూములను గత బిఆర్ఎస్ సర్కార్ ఎడాపెడా అమ్మేసింది. ఆ భూములు కూడా అస్మదీయ కంపెనీలకే కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కోకాపేట భూముల విషయంలో భారీ స్కాం జరిగిందిఅని ...ఇప్పుడు అమ్మినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తీసుకుంటామని మీడియా సమావేశాలు పెట్టి మరీ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడితో ఆగలేదు..కెసిఆర్ సర్కారు నిర్వహించిన వేలం ద్వారా సర్కారు ఖజానాకు వేయి కోట్ల రూపాయల మేర నష్టం వచ్చింది దీనిపై విచారణ జరిపించాలని అని ఏకంగా సిబిఐ కి ఫిర్యాదు చేశారు.
కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి తో పాటు కేంద్రంలోని మోడీ సర్కారు దీనిపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని అటు కిషన్ రెడ్డి కానీ..బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చి కూడా దగ్గర దగ్గర ఐదు నెలలు కావస్తోంది. అయినా సరే అటు రేవంత్ రెడ్డి కానీ..మరొకరు కానీ కోకాపేట భూముల వేలం విషయంపై ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడక పోవటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు హెటిరో అధినేత పార్ధ సారధి రెడ్డి కి చెందిన సాయి సింధూజ ఫౌండేషన్ కు గత బిఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపును స్పల్ప మార్పులతో మళ్ళీ ఒకే చేయటంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
దీంతో రేవంత్ రెడ్డి తాను సిబిఐ కి ఫిర్యాదు చేసిన...తీవ్ర విమర్శలు చేసిన కోకాపేట భూముల విషయాన్ని కూడా వదిలేస్తారా...లేక ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. తాజా పరిణామాలను గమనిస్తుంటే రేవంత్ రెడ్డి అప్పుడే రివర్స్ గేర్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ కూడా అధికార వర్గాల్లో నడుస్తోంది. అత్యంత విలువైన కోకాపేట భూముల విషయంలో ఆయన భవిష్యత్ లో అయినా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేక అలాగే వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. మాజీ సీఎం కెసిఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నహైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ గ్రూప్ లు అయిన రాజపుష్ప, మై హోమ్ సంస్థలు డిస్కౌంట్ ధరకే కోకాపేట లో భూములు దక్కించుకున్నట్లు రేవంత్ రెడ్డి సిబిఐ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.