ఏపీ నూతన పారిశ్రామిక విధానం విడుదల

Update: 2020-08-10 08:19 GMT

ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త పారిశ్రామిక విధానాన్ని సోమవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ఈ విధానం తీసుకొచ్చినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాలు ప్రకటించారు. మెగా పరిశ్రమలకు పెట్టుబడులను బట్టి అదనపు రాయితీలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను మరింత ప్రోత్సహించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఈ విధానం 2020-23 సంవత్సరం వరకూ అమల్లో ఉండనుంది. నూతన విధానం రూపకల్పన కోసం తాము ఎనిమిది నెలలు పనిచేశామని మంత్రి తెలిపారు.

ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం ఇది అని తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌ టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్‌ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పారిశ్రామిక అనుమతులను వేగవంతం చేసేందుకు వైఎస్ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టారు.

 

 

Similar News