రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు

Update: 2020-07-02 16:42 GMT

గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదుకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఎంపీల బృందం కోరే అవకాశం ఉంది. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రఘురామకృష్ణంరాజు లెటర్ హెడ్ పై ఉన్న పార్టీ పేరుపై అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అసలు క్రమశిక్షణా కమిటీ నోటీసు ఇవ్వాలి కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంటారా? అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

దీంతోపాటు సీఎం జగన్ కు కూడా ఆయన లేఖ రాసి..తాను ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న అక్రమాల గురించి ప్రస్తావించానే తప్ప..ఎక్కడా పార్టీకి, పార్టీ అధినేత, సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని..తాను పార్టీ అధినేత నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అదే సమయంలో తనకు సమయం ఇవ్వాల్సిందిగా జగన్ కు రాసిన లేఖలో కోరారు. అయితే అధిష్టానం మాత్రం రఘురామకృష్ణంరాజు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే ఆయనపై వేటుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.

Similar News