‘వన్స్ మోర్’ అంటున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. అంతా అయిపోయాక ఆయన రంగంలోకి దిగుతారు. రాజకీయంగా హీట్ ఉన్నప్పుడు ఓ చేయి వేస్తే అందులో ఎంతో కొంత ప్రయోజనం ఆ పార్టీకి కూడా ఉంటుంది. వేడి చల్లారి అందరూ ఆ సంగతి మర్చిపోతున్న తరుణంలో ఆయన సీన్ లోకి వస్తారు. అది అమరావతి వ్యవహారం అయినా..కాపుల రిజర్వేషన్లు అంశం అయినా. కారణాలు ఏమైనా వైసీపీ అధినేత, జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యంకాదని ఎన్నికలకు ముందే ప్రకటించారు. అయితే తాము అధికారంలోకి వస్తే కాపుల కోసం చంద్రబాబు హయాం కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు. కాకపోతే ఇఫ్పుడు సీఎం జగన్ కేటాయించిన నిధులపై విమర్శలు ఉన్నాయి. అన్ని వర్గాలకు అందించే పథకాల్లోని నిధుల వాటాను కాపులకు విడిగా లెక్కించి ...వాటిని కూడా కాపులకు ప్రత్యేకంగా సాయం చేసినట్లు చూపిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అయితే రిజర్వేషన్ల విషయంలో మాత్రం కుండబద్దలు కొట్టినట్లు తేల్చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సొంత ఇంటర్వ్యూల్లో ఎన్నికలకు ముందు జగన్ ఓ సారి రిజర్వేషన్లు ఇవ్వటం కుదరదని చెప్పారు. అయినా ప్రజలు ఓటేసి గెలిపించారు. కానీ మళ్లీ ఇప్పుడు ఓ సారి చెప్పండి రిజర్వేషన్లు ఇవ్వం అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జగన్ తోపాటు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా రిజర్వేషన్లు ఇవ్వమని చెపితే స్పష్టత వస్తుంది అంట. ఒకసారి చెప్పారు..అయినా జగన్ కు ఓట్లేశారని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఏదో ‘వన్స్ మోర్’ అన్నట్లు మరోసారి చెప్పండి ఇక క్లారిటీ వస్తుందని మాట్లాడటం ఫన్నీగా ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదే పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.