ఇసుక దోపిడీ...వైసీపీ, టీడీపీ సేమ్ టూ సేమ్

Update: 2020-05-11 12:38 GMT

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అచ్చం అలాగే సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత జనసేన ప్రజా సమస్యలపై జనసేన రాజకీయ పోరాటం ప్రారంభించనుందని తెలిపారు. ఆయన సోమవారం నాడు తూర్పు గోదావరి జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు. అందరూ కరోనా సంక్షోభ సమయంలో ఉంటే అధికార వైసీపీ నేతలు దోపిడీ పనిలో ఉన్నారని విమర్శించారు. “కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదేదో చాలా చిన్న జ్వరం... ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల శాతం తక్కువే లాంటి మాటలతో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇది విజృంభిస్తే చికిత్స అందించేందుకు మన ఆసుపత్రుల సామర్థ్యం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు సరిపోవు.కాబట్టి కరోనా అవగాహనతో నిబంధనల ప్రకారం జీవించడానికి అలవాటుపడాలి. లాక్డౌన్ సడలింపులు త్వరలోనే వస్తాయి. ప్రజా సమస్యలపైనా, వనరులను దోచుకొంటున్న తీరుపైనా మనం రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సడలింపుల తరవాతా పలు నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు.

వాటికి అనుగుణంగానే మన పోరాటాన్ని సాగించాలి. ఈ విషయంపై త్వరలోనే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తాం. ’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఈ ఆపత్కాలంలో మానవత్వంతో, చిత్తశుద్ధితో, ఎంతో ధైర్యంతో జనసేన శ్రేణులు చేసిన సేవలు ప్రశంసనీయం. ఎప్పటికప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. మన అధ్యక్షుడు స్పందిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోనూ, ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోను రేషన్ కార్డులను తొలగించేందుకు సర్వే చేయడం మొదలైంది. మన నాయకులు, శ్రేణులు ఈ తొలగింపు ప్రక్రియపై దృష్టి సారించండి. అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి. అదే విధంగా క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలి” అన్నారు.

 

Similar News