కరోనాపై డబ్ల్యుహెచ్ వో సంచలన వ్యాఖ్యలు

Update: 2020-05-14 08:23 GMT

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంత కాలం జాగ్రత్తలు చెబుతూ వచ్చిన ఈ సంస్థ ఎయిడ్స్ లాగా కరోనా కూడా అలా కొనసాగుతుందని ప్రకటించింది. అసలు కరోనా అంతం అయ్యే అవకాశాలు కూడా కన్పించలేదని పేర్కొనటం మరింత కలకలం రేపుతోంది. కరోనా వైరస్ తో కలసి జీవితం అలవాటు చేసుకోవాలని మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలోని పలు చోట్ల లాక్ డౌన్ ఆంక్షలు తొలగిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పటికి కరోనా వైరస్ ను అంతం చేయగలమనేది ప్రస్తుతానికి చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వ్యవహారాల డైరక్టర్ మైఖేల్ ర్యాన్ స్పష్టం చేశారు. ఇది శాశ్వత వైరస్ గా రూపాంతరం చెందే అవకాశం ఉందన్నారు. దీనికి కారణం ఇది 200 దేశాలకు పాకటమే అన్నారు.

హెచ్ఐవిని నిర్మూలించలేకపోయినా ఎలా కట్టడి చేయవచ్చో తెలుసుకున్నట్లే , కరోనా విషయంలో కూడా ముందుకు వెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా రెండవసారి కూడా రావొచ్చని తెలిపారు. అప్రమత్తతే అత్యవసరం అని డబ్ల్యుహెచ్ వో అధ్యక్షుడు ట్రెడోస్ అథనోమ్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షల సడలింపును ఆయన కారణంగా చూపించారు. వ్యాక్సిన్ మాత్రమే దీన్ని అంతం చేయగలదని తేల్చిచెప్పారు. దీన్ని ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తేవటం అందరి కర్తవ్యం కావాలన్నారు.

 

Similar News