కరోనా కేసులు పెరిగినా భయం అక్కర్లేదు

Update: 2020-05-27 16:04 GMT

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదని..ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చినా కరోనా కేసులు పెద్దగా పెరగకపోవటం శుభపరిణామం అన్నారు. కేసులు పెరిగినా తగిన వైద్య సేవలు అందించడానికి వైద్య,ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలని వైద్యాధికారులను కోరారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతున్నది.

ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదు. వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదు. కరోనాకు వ్యాక్సిన్, మెడిసిన్ రాలేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం అవసరం’’ అని వైద్యాధికారులు, నిపుణులు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

 

Similar News