రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలి

Update: 2020-04-29 09:22 GMT

అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రైతులను కేసుల పేరుతో వేధించటం తగదన్నారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు బుధవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన రైతులపట్ల, రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలపట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా, సానుభూతితో ఆలోచించాలి. కరోనా విపత్తుతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించే సమయం వచ్చింది. గత ఏడాది మాదిరి కౌలు చెల్లింపులో జాప్యం చోటు చేసుకొంటే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందనే ఆందోళనలో రైతుల్లో నెలకొంది. రాజధాని రైతులు తమ బాధలను నా దృష్టికి తీసుకువచ్చారు. కరోనా మూలంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల తమకు ఇచ్చే కౌలు మొత్తాన్ని పెంచి వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. వారి విజ్ఞప్తి సహేతుకమైనదే. వారి కౌలు మొత్తాలను తక్షణం విడుదల చేయాలి. నిబంధనల మేరకు భూమి లేని పేదలకు ప్రతి నెల చెల్లించే పెన్షన్లు కూడా సకాలంలో అందడం లేదని ఆవేదన చెందుతున్నారు.

పేద ప్రజలకు ఇప్పుడు చేసేందుకు పనులు కూడా లేవు. తమకు జీవనాధారమైన భూమిని రాజధాని కోసం ఇచ్చి... ఇప్పుడు అక్కడి నుంచి రాజధాని తరలిస్తామని పాలక పక్షం చెప్పడంతో గత 130 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రైతు కుటుంబాలు రోడ్డుపైకి వచ్చాయి. కరోనా కాలంలోనూ నిబంధనల మేరకు తగిన సామాజిక దూరం పాటిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వారిపై పాత కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ లకు తీసుకువెళ్లడం తగదు. లాక్ డౌన్ విధించిన సమయంలోనే సి.ఆర్.డి.ఎ. మాస్టర్ ప్లాన్ లో ఆర్-5 జోన్ నిబంధనలు చేర్చి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామనడం, ఆన్ లైన్ లోనే తెలియచేయాలని ప్రకటించడం రాజధాని రైతులను మానసిక ఆందోళనకు గురిచేయడమే అవుతుంది. ఈ విషయాన్ని ప్రశ్నించినవారిపై కేసులు నమోదు చేయడం సరికాదు. రాజధాని రైతులను ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం సత్వరమే నిలిపివేయాలి.’ అని పవన్ కళ్యాణ్ కోరారు.

 

 

 

Similar News