హైదరాబాద్ లో మహీంద్రా ఉచిత క్యాబ్ సేవలు

Update: 2020-04-07 14:40 GMT

మహీంద్ర సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఉచిత అత్యవసర క్యాబ్ సేవలను మహీంద్రా లాజిస్టిక్స్ అలిటీ (ALYTE) ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఈ సేవలనందుకోవడానికి +918433958158 కు డయల్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. వైద్యేతర అత్యవసర రవాణాకు సహాయపడటానికి ఈ ప్రత్యేక ఫ్లీట్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో అతిపెద్ద 3పీఎల్ సొల్యూషన్ ప్రొవైడర్లలో ఒకటైన మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్) మంగళవారం నాడు తమ ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ వ్యాపారం అలిటీ (ALYTE) ద్వారా ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రభావితమైన వారికి అత్యవసర క్యాబ్ సేవలనందించనున్నట్లు వెల్లడించింది. ఈ సేవలను పూర్తి ఉచితంగా హైదరాబాద్‌లో అందించనున్నారు. ఈ సేవల కోసం అలిటీ ప్రత్యేకంగా వాహనాలను సిద్ధంగా చేసింది. నిత్యావసరాల కొనుగోలు, మందులు, బ్యాంకులను సందర్శించడం, పోస్ట్ ఆఫీసులు, క్రమం తప్పని వైద్య సందర్శన వంటి సేవలను వినియోగించుకోవాలనుకునే సింగిల్ మదర్స్, దివ్యాంగులు, వృద్ధులు మొదలైన వారిని దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటుచేశారు. అలాగే అవసరమైన సేవలనందించే వైద్యులు, నర్సులకు సైతం ఈ సేవలను అందించనున్నారు.

హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ భాగస్వామ్యంతో 24 గంటలూ ఈ సేవలు సైబరాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, రాచకొండలలో లభ్యమవుతాయి. మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో రామ్‌ప్రవీణ్ స్వామినాథన్ మాట్లాడుతూ "మన సమాజానికిది కష్టకాలం. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి విభిన్నమైన వాటాదారులంతా ఒకే దరికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సంక్షోభ సమయంలో ప్రజలు తమ అత్యావసరాలను సైతం తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని గమనించాం. ఈ సేవలు అలాంటి వారికి తగిన సహాయాన్ని అందించగలదు. ప్రామాణిక పరిశుభ్రత, శానిటేషన్, భద్రతా ప్రమాణాలను ఈ కార్లు కలిగి ఉంటాయి. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ సేవలను త్వరలోనే మిగిలిన నగరాలకు విస్తరించనున్నాం..'' అని తెలిపారు.

 

Similar News