ముఖేష్ అంబానీ ఒక్క రోజు నష్టం 40 వేల కోట్లపైనే!

Update: 2020-03-10 04:14 GMT

ముఖేష్ అంబానీ. ఆసియాలో అత్యంత సంపన్నవ్యక్తి. ఇప్పుడు ఆయన సంపద ఒక్క రోజులో ఏకంగా 40 వేల కోట్ల రూపాయలపైనే గాల్లో కలిసిపోయింది. కారణం స్టాక్ మార్కెట్లో జరిగిన అల్లకల్లోలమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు గత పన్నెండు సంవత్సరాల్లో ఎన్నడూలేని రీతిలో సోమవారం నాడు దారుణ నష్టాలను మూటకట్టుకుంది. ఈ కంపెనీ షేరు ఒక్క రోజులోనే 157 రూపాయలు పతనం అయింది. ఈ దెబ్బకు 52 వారాల గరిష్ట స్థాయికి..ఈ మధ్యనే 1617 రూపాయలకు చేరిన షేరు ధర తక్కువ వ్యవధిలోనే 1113 రూపాయలకు పతనం అయింది.దీంతో అంబానీ ఏకంగా 5.7 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయినట్లు అయిందని ఫోర్బ్స్ వెల్లడించింది.

ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుండగా..మరో వైపు క్రూడ్ ధరల పతనం కూడా రిలయన్స్ ను దారుణంగా దెబ్బతీసింది. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తర్వాత స్టాక్ మార్కెట్ పతనం వల్ల భారీగా నష్టపోయింది ముఖేష్ అంబానీయే అని ఫోర్బ్స్ వెల్లడించింది. హోలీ సందర్భంగా మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లకు సెలవు కావటం కలిసొచ్చిందనే చెప్పాలి. లేదంటే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు మరింత పతనాన్ని చవిచూసేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Similar News