ఆసక్తి పెంచిన అంబానీ..జగన్ ల భేటీ

Update: 2020-03-01 04:57 GMT

ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఓ అంశం హాట్ టాపిక్ గా మారింది. అదే ఏపీ సీఎం జగన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీల భేటీ. జగన్ కు మొదటి నుంచి అంబానీలతో ఏ మాత్రం సఖ్యత లేదు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కె జీ బేసిన్ గ్యాస్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలోని సహజ వనరులను అప్పనంగా రిలయన్స్ దోచుకెళుతోందని..దీనికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎంతో సహకరించారన్నది అప్పట్లో వైఎస్ ఆరోపణ. ఆ తర్వాత వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటంతో అప్పట్లో వైసీపీ నేతలు చాలా మంది రిలయన్స్ ను టార్గెట్ చేశారు. దీని వెనక రిలయన్స్ కుట్ర ఉందనే విమర్శలు తీవ్ర స్థాయిలో చేశారు. అప్పటి నుంచి జగన్, రిలయన్స్ ల మధ్య సఖ్యత లేదు. దేశంలోని మిగతా పారిశ్రామిక దిగ్గజాలతో జగన్ కు సాన్నిహిత్యం ఉన్న అంబానీలతో మాత్రం లేదనే విషయం అందరికీ తెలిసిందే.

కానీ సడన్ గా జగన్ సీఎం అయిన ఇన్ని నెలలకు అంబానీ అమరావతిలో ప్రత్యక్షం కావటం ఆసక్తికర పరిణామాంగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న పెట్టుబడి నిర్ణయాల్లో రిలయన్స్ కొంత మేర కుదించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అంబానీ పర్యటన కేవలం పారిశ్రామికపరమైనదేనా?. లేక రాజకీయ కోణంలో అన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వం మాత్రం అధికారికంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీలో పెట్టుబడుల అంశాలపైనే చర్చించారని చెబుతోంది. అయితే ఇక్కడ ఆ ఆసక్తికర అంశం ప్రచారంలోకి వచ్చింది.

అదేంటి అంటే వైసీపీ కోటాలో ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన పరిమళ్ నథవానికి రాజ్యసభ సభ్యత్వం కోరారని. జగన్ ను కలిసిన అంబానీ టీమ్ లో ఆయన కూడా ఉన్నారు. దీంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత వచ్చింది. పరిమల్ నథవాని 2008 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014లో జార్ఘండ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏప్రిల్‌ 9వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపద్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఇది నిజమో కాదో తేలాలంటే ఓ వారం రోజులు ఆగాల్సిందే.

 

Similar News