వలస కూలీలపై కెమికల్ స్ప్రే కలకలం

Update: 2020-03-30 13:53 GMT

కరోనా వైరస్ ముఖ్యంగా పేదల జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. కార్మికులు..వలస కూలీలు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ తో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. చాలా మంది బతుకుజీవుడా అంటూ తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అగచాట్లు పడుతున్నారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ లోని బరేలి వద్ద వలస కూలీలపై కెమికల్ స్ప్రే చేయటం దుమారం రేపింది. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన వలస కూలీలతో వైరస్ వచ్చే ప్రమాదం ఉందని భావించిన అధికారులు ఈ అమానుష చర్యకు దిగటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అధికారుల వాదన మాత్రం తమను తాము సమర్ధించుకునేలా ఉంది.

ప్రతి ఒక్కరిని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే తాము అలా చేశామని..క్లోరిన్ ను నీటితో కలిపి స్ప్రే చేశామని తెలిపారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం కూడా మొదలైంది. ప్రభుత్వ అధికారుల తీరును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బిఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుపట్టారు. ఇలాంటి చర్యలతో ఇఫ్పటికే ఎన్నో ఇక్కట్ల పాలైన వలస కూలీలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టొద్దని..వారిపై రసాయనాలు చల్లటం వల్ల వారి ఆరోగ్యాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. వలస కూలీలపై కెమికల్ స్ప్రే సర్కారు క్రూరత్వానికి నిదర్శనం అని మాయావతి ఆరోపించారు.

Similar News