లోక్ సభలో ‘అమరావతి భూ స్కామ్’

Update: 2020-02-03 13:10 GMT

పార్లమెంట్ రికార్డుల్లోకి ‘అమరావతి భూ స్కామ్’ ఎక్కింది. లోక్ సభలో వైసీపీ పార్టీపక్ష నేత మిథున్ రెడ్డి ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. గత కొంత కాలంగా వైసీపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. అంతే కాదు..టీడీపీ నేతలకు ఇది ఓ కామధేనువుగా మారనుందనే కారణంతో రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు ఏకంగా అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదింపచేసుకున్నారు. అప్పటి నుంచి ఏపీలో రాజధాని వ్యవహారం ఓ రాజకీయ రచ్చగా మారింది. ఈ తరుణంలో పార్లమెంట్ లో కూడా అమరావతి భూముల వ్యవహారం తెరపైకి తెచ్చారు.

చంద్రబాబునాయుడిని కాపాడటమే టీటీపీ ఎంపీల ప్రధాన అజెండాగా మారిందని మిథున్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో నాలుగు వేల ఎకరాల భూమి కొన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని మిథున్‌రెడ్డి తెలిపారు. దారిద్ర్యరేఖ దిగువన ఉన్న 780 మంది కోట్లు పెట్టి భూములు కొన్నారని ఆయన అన్నారు. అమరావతి భూకుంభకోణంపై విచారణకు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగిందని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. సీబీఐ విచారణ జరిపించాలని మిథున్ రెడ్డి లోక్ సభలో కోరారు. ముందు రాజధాని ఓ చోట వస్తుందని చెప్పి..తర్వాత మార్చారని ఆరోపించారు.

Similar News