కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేసింది. దీని ద్వారా ఏటా సర్కారుకు 40 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2020-21 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ లో ఈ మార్పులను ప్రతిపాదించారు. ఆదాయ పన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంచుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు. తాజా మార్పుల ప్రకారం 0 నుంచి 2.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదని, 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.
రూ. 5-7 లక్షల వార్షిక ఆదాయంపై ఇప్పటి వరకు ఉన్న పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి, రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్నును 20 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు.. అదే విధంగా రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను, రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులోనూ కేంద్రం పలు మెలికలు పెట్టింది. 80 సీ కింద ఇచ్చే రాయితీలు కావాలా...పన్ను రాయితీలు కావాలా అన్నది ఉద్యోగులే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.దీంతో అసలు మిగులు ఎంత అన్నది గందరగోళంగా మారింది.
నూతన పన్ను శ్లాబులు
జీరో నుంచి 2.5 లక్షల రూపాయల వరకూ ఎలాంటి పన్ను లేదు
2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ 5 శాతం పన్ను
5 లక్షల రూపాయల నుంచి 7.5 లక్షల రూపాయల వరకూ 10 శాతం పన్ను
7.5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకూ 15 శాతం పన్ను
10 లక్షల రూపాయల నుంచి 12.5 లక్షల రూపాయల వరకూ 20 శాతం పన్ను
12.5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకూ 25 శాతం పన్ను
15 లక్షల రూపాయలపైన వేతనం ఉండే వారు మాత్రం 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.