ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ సినిమాలకు ఎంతో ప్రత్యేకం . పండగ సెలవులు టార్గెట్ గా చేసుకుని పెద్ద హీరో ల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు కూడా తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లో విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. కొన్ని సార్లు థియేటర్ల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. పెద్ద హీరో లుగా చెప్పుకునే వాళ్లకు కూడా అప్పుడప్పుడు ఈ థియేటర్ల తిప్పలు తప్పవు. 2025 సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు మాత్రమే రంగంలో నిలిచాయి. అందులో రెండు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
జనవరి పదిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కాగా...జనవరి 12 న అంటే ఆదివారం నాడు నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన డాకుమహారాజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మిగిలింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అటు గేమ్ ఛేంజర్, ఇటు సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు కూడా నిర్మాత దిల్ రాజే. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా కావటం..ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావటంతో గేమ్ ఛేంజర్ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు తో పాటు చిత్ర యూనిట్ అంతా కూడా ఒక్క పాటలకే 75 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం.
మూడేళ్లు కష్టపడి సినిమాను అద్భుతంగా తీసుకొచ్చాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలం అయింది. అంతే కాదు..చివరకు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై పెదవి విరిచిన పరిస్థితి. జస్ట్ రొటీన్ సినిమాగా...సినిమా అంతా ఫ్లాట్ గా సాగటంతో గేమ్ ఛేంజర్ మూవీ తో ఎక్కడా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. ఈ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. భారతీయుడు 2 , ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాలు చూసిన తర్వాత చాలా మంది దర్శకుడు శంకర్ లో సరుకు అయిపోయింది అనే కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా లో రామ్ చరణ్, ఎస్ జె సూర్యల నటన బాగున్నా కూడా కథ మైనస్ కావటంతో వీళ్లిద్దరు ఎంత బాగా నటించినా సినిమాపై అది ప్రభావం చూపించలేకపోయింది. ఇక సంక్రాంతి సీజన్ సెంటిమెంట్ పై భారీ ఎత్తున ఆశలు పెట్టుకునే నందమూరి బాలకృష్ణ కు ఈ సీజన్ మరో సారి వర్క్ అవుట్ అయింది అనే చెప్పాలి.
గేమ్ ఛేంజర్ తో పోలిస్తే డాకుమహారాజ్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి. అదే సమయంలో ఈ సినిమాలో కూడా కథలో కొత్తదనం లేకపోయినా కూడా దర్శకుడి టేకింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్, థమన్ మ్యూజిక్ తో పైసా వసూల్ అన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ముఖ్యంగా డాకుమహారాజ్ మూవీ ఫస్ట్ హాఫ్ దుమ్ము రేపితే ...సెకండ్ హాఫ్ స్లో అవుతుంది. మొత్తం మీద నందమూరి బాలకృష్ణ తనదైన యాక్షన్ సన్నివేశాలతో పాటు డైలాగులతో సినిమా లో జోష్ నింపాడు. ఇప్పటికే విడుదల రెండు సినిమా ల విషయానికి వస్తే గేమ్ ఛేంజర్ తో పోలిస్తే డాకుమహారాజ్ సినిమానే కమర్షియల్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే మొత్తం మీద నిజమైన సంక్రాంతి విన్నర్ ఎవరో తేలాలి అంతే వెంకటేష్, అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం విడుదల వరకు అంటే...జనవరి 14 వరకు ఆగాల్సిందే. ఆ తర్వాతే మూడు సినిమాల్లో బెస్ట్ మూవీ ఏది అన్నది తేలుతుంది. ఇప్పటి వరకు అయితే బాలకృష్ణ డాకుమహారాజ్ ముందు ఉన్నాడు అనే చెప్పాలి.