అప్పుడు ఇటుకలు అమ్మారు...ఇప్పుడు విరాళాలు అడుగుతున్నారు

Update: 2020-01-10 04:18 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏది చేసినా ప్రజలు సాయం చేయాల్సిందేనా?. అమరావతి నిర్మాణానికి అప్పుడు ‘ఇటుకలు’ అమ్మారు. ‘మై బ్రిక్..మై అమరావతి’ అని ఓ నినాదం ఇచ్చారు. కొంత మంది ఈ నినాదానికి స్పందించి ఇటుకలు కొనుగోలు చేశారు. వచ్చిన మొత్తం కూడా నామమాత్రంగానే ఉంది. మరి ప్రజలు ఐదేళ్లు అధికారం అప్పగిస్తే ఏమి చేశారు?. ముందు చేయాల్సిన పనులు వెనక..వెనక చేయాల్సిన పనులు ముందు?. ఫలితం రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులతో పాటు లక్షల సంఖ్యలో మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు భారీ ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. తన ఐదేళ్ళ పాలనలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు ఓ ఐదారు వేల కోట్ల రూపాయలతో శాశ్వత సచివాయం, అసెంబ్లీ భవనాలు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని సాక్ష్యాత్తూ తెలుగుదేశం నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారంలో ఉండగా ఎవరి మాటను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించి ఇప్ప్పుడు రైతులతో పాటు లక్షలాది మధ్య తరగతి ప్రజలను నిండా ముంచారనే విమర్శలు చంద్రబాబు మూటకట్టుకోవాల్సి వస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉండగా అమరావతి నిర్మాణానికి మై బ్రిక్ ..మై అమరావతి అంటూ ప్రజల భాగస్వామ్యం కోరారు. ఇప్పుడు ఐదేళ్ళు అధికారం అనుభవించి వచ్చి అమరావతి ఉద్యమం కోసం ప్రజలను ‘విరాళాలు’ కోరుతూ జోలె పడుతున్నారు. అంటే అప్పుడు ప్రజలే ఇటుకలు కొనాలి...ఇప్పుడు ప్రజలే విరాళాలు ఇవ్వాలి. పోనీ ప్రజలు విరివిగా విరాళాలు ఇఛ్చి రోడ్డెక్కి ఉద్యమం చేస్తే ‘అమరావతి’ తరలింపును అడ్డుకోగలనని చంద్రబాబు ప్రజలకు హామీ ఇవ్వగలరా?. అసలు అది సాధ్యం అయ్యే పనేనా?.

 

 

 

Similar News