ఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టులో కేసు దాఖలు కావటంతో సర్కారు కూడా వేగంగా స్పందించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు విన్పించేందుకు మాజీ అటార్ని జనరల్ ముకుల్ రోహత్గిని ఎంపిక చేసుకుంది. దీని కోసం ప్రణాళిక శాఖకు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలుత కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని అమరావతిని విభజిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దీనిపై అమరావతి రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అసెంబ్లీలో ఏపీసీఆర్ డీయే రద్దుతోపాటు రాజధాని వికేంద్రీకరణల బిల్లులకు ఆమోదం లభించింది. మండలిలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులపై బుధవారం నాడే హైకోర్టులో విచారణ జరిగినా..మండలిలో ఈ అంశంపై చర్చ సాగుతోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించటంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.