మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే

Update: 2020-01-20 17:08 GMT

మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే... ఇవి శాశ్వతం కాదనీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ మాట్లాడారు. పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్, పి.ఎ. సి. సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. శాశ్వతమైన పరిపాలనా రాజధాని అమరావతిలో మాత్రమే ఏర్పాటవుతుందన్నారు. అది జనసేన-బీజేపీ పార్టీలతోనే సాధ్యమవుతుందనీ, మూడు రాజధానుల ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీతో కలసి పనిచేయడానికి వివిధ స్థాయిల్లో రెండు పార్టీల నాయకులతో సమన్వయ కమిటీలు ఏర్పాటవుతాయని పీఏసీ సభ్యులకు తెలిపారు. సమన్వయ కమిటీల నిర్ణయం మేరకు ఆయా ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "5 కోట్ల మంది ప్రజలతోపాటు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో అమరావతి రాజధాని ఏర్పాటయ్యింది.

ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులు.. ప్రజల ఆక్రందన, ఆక్రోశం, ఆందోళన మధ్య ఏకపక్షంగా ఏర్పాటవుతున్నాయి. 7,200 మంది పోలీసులను నియమించి, ప్రజలను భయభ్రాంతులను చేసి, నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై లాఠీలను ప్రయోగించి వైసీపీ శాసనసభాపక్షం శాసనసభా సమావేశాలను ప్రారంభించింది. విశాఖపట్నం, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదు. విభజించి పాలించు అనే బ్రిటీష్ వారి సూత్రాన్ని అమలుచేసి, ప్రాంతాల మధ్య బేధభావాలు సృష్టించి వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది.

నిజానికి ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధినే కానీ ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం కాదు. రాయలసీమ ప్రాంతవాసులకు విశాఖపట్నం దూరాభారం అని తెలిసినా అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం వెనకాల విశాఖపై వైసీపీకి ఉన్నది ఆపేక్ష కాదు... స్వలాభాపేక్ష. పుష్కలంగా ఉన్న భూ సంపదను చేజిక్కించుకోవడమే వైసీపీ పెద్దల అసలు వ్యూహం. ప్రశాంతతకు మారుపేరయిన విశాఖపట్నాన్ని ఫ్యాక్షనిస్టుల నుంచి జనసేన-బీజేపీ పార్టీలు కాపాడుకుంటాయి. విశాఖ నగరాన్ని అభివృద్ధి పరంగా విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి జనసేన-బీజేపీలు కృత నిశ్చయంతో ఉన్నాయి.

 

 

 

 

Similar News