ఇలాంటి మండలి మనకు అవసరమా?

Update: 2020-01-23 12:42 GMT

సోమవారం తేల్చేద్దాం

పేద రాష్ట్రానికి ఏటా 60 కోట్లు ఖర్చు ఎందుకు?.

ప్రచారమే నిజం కాబోతుందా?. ఏపీలో శాసనమండలికి మంగళం పాడబోతున్నారా?. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు శాసనసభలో చేసిన ప్రకటన చూస్తే ఖచ్చితంగా ఇదే అనుమానం రాక మానదు. వచ్చే సోమవారం నాడు మళ్ళీ ఏపీ శాసనసభ సమావేశం అయి మండలి భవితవ్యాన్ని తేల్చనుంది. మండలికి సంబంధించి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ తీరు అత్యంత భాధాకరం అని వ్యాఖ్యానించారు. మండలిలో ఛైర్మన్ షరీఫ్ రాజధాని వికేంద్రీరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపే ముందు చేసిన ప్రకటన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించి చూపారు. అనంతరం జగన్ మాట్లాడారు. సీఎం జగన్ మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే...‘అసలు రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు. సీటు ఆఫ్ గవర్నెన్స్ అని మాత్రమే ఉంది. పరిపాలన కోసం, పరిపాలన వికేంద్రీకరించేందుకు ప్రభుత్వానికి ప్రజలు ఇఛ్చిన అధికారం ఇది. జయలలిత బతికున్న రోజుల్లో ఊటి నుంచి నడిపేవారు. రేపు పొద్దున ఏదైనా విపత్తు వస్తుంది. ముఖ్యమంత్రి అక్కడ 20 రోజులు ఉంటారు. పరిపాలన అక్కడ నుంచే జరుగుతుంది. సీఎం ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన జరుగుతుంది. ఒక తీర్మానం చేసి ఎక్కడ నుంచి అయినా పరిపాలన చేయోచ్చు.

ఇది వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు. ఎక్కడ నుంచైనా చట్టాలు చేయవచ్చు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. వాళ్లు తీర్మానం చేస్తే అదే పరిపాలన. ఎందుకింత డ్రామాలు చేస్తున్నారు. నైతిక విలువలు మర్చిపోయి ఎందుకు ఇలా చేస్తున్నారు అని వాళ్ళంతట వాళ్లు ప్రశ్నించుకోవాలి. మండలి అనేది కేవలం ప్రభుత్వం సూచనలు..సలహాలు ఇవ్వటానికి ఏర్పాటు చేసుకున్నది. అసలు మండలి అనేది తప్పనిసరి కాదు. ఇంగ్లీష్ మీడియంకు అసెంబ్లీలో చంద్రబాబు మద్దతు ప్రకటిస్తారు. మండలికి పోయి మేం ప్రతిపక్షం అడ్డుకుంటాం అంటారు. మండలిపై ఏటా 60 కోట్లు ఖర్చే చేస్తున్నాం. ఐదేళ్లకు 300 కోట్లతో ఇలా రాజకీయ ఏజెండాతో నడిచే సభలను కొనసాగించటం అవసరమా?. సూచనలు.సలహాలు ఇవ్వాల్సింది పోయి, జాప్యం చేసేందుకు ఆరాటపడుతున్న ఇలాంటి సభలను కొనసాగించాలా..వద్దా అనే దీనిపై సీరియస్ గా ఆలోచించాలి. సోమవారం సభను పెట్టండి..సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందాం. సిస్టమ్ ను క్లీన్ చేసే దిశలో మీరు కూడా అడుగు ముందుకేయాలని అభ్యర్ధిస్తున్నాను.’ అని ప్రకటించారు.

హత్య చేయటం తప్పు అని తెలిసినా కూడా..తన విచక్షణా అధికారాన్ని ఉపయోగించి హత్య చేస్తానని ప్రకటించటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం కాదా? అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శాసనసభకు ఎన్నికైన సభలో రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు, డాక్టర్లు, నటులు..జర్నలిస్టులు,,లాయర్లు ఎంతో మంది విజ్ణులు ఉన్నారు. మనది పేద రాష్ట్రం మనకు మండలి అవసరమా? అని ఆలోచించాలి. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయి. ఇటువంటి సభలు ఉండాలా? వద్దా అని అందరూ అని ఆలోచించాలి. మంచి చేయటం కోసం తమ బుర్రలు పెట్టకుండా ..ప్రతి మంచిని జరగనివ్వకుండా ఎలా ఆపాలి..ప్రజలకు జరగాల్సిన మంచిని ఎలా జాప్యం చేయాలి అని రూల్స్ ను సైతం ఉల్లంఘించి చేసేవాటిని కొనసాగించాలా వద్దా అని ఆలోచించాలి.

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా..చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా మండలి పనిచేసింది. చట్టం, రూల్స్ తో సంబంధం లేకుండా ఉన్న మండలిని కొనసాగించాల్సిన అవసరం ఉందా?. ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగింది తప్పు అని తెలిసినా..చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సన్మానాలు..ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం దారుణం అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను సోమవారానికి వాయిదా వేశారు.

 

Similar News