తాజ్ మహల్ కు అరవై శాతం తగ్గిన పర్యాటకలు

Update: 2020-01-01 04:52 GMT

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా భారత్ లో కొనసాగుతున్న నిరసనలు దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క డిసెంబర్ నెలలోనే ఏకంగా రెండు లక్షల మంది దేశీయ, విదేశీ పర్యాటకులు తమ సందర్శనను వాయిదా వేసుకున్నారని సమాచారం. ఒక్క తాజ్ మహల్ వరకే కాకుండా దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలపై ఈ ప్రభావం పడింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే 2019 డిసెంబర్ లో తాజ్ మహల్ కు వచ్చే పర్యాటకులు 60 శాతం మేర తగ్గినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్యాటకులు ఫోన్లు చేసి మరీ భద్రతా పరిస్థితిపై ఆరా తీశారని..ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇఛ్చినా కూడా చాలా మంది తమ పర్యటనలు వాయిదా వేసుకున్నారు.

తాజ్ మహల్ కు ఏటా 65 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. ప్రవేశ రుసుం ద్వారా సంవత్సరానికి సుమారు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆర్ధిక మందగమనం కారణం అసలే వ్యాపారం తగ్గి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ఆందోళనలు తమను మరింత దెబ్బతీశాయని ఆతిథ్య పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్న అస్సాం పర్యాటకంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, రష్యా, ఇజ్రాయెల్, సింగపూర్, కెనడా, తైవాన్ వంటి దేశాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. దీంతో ఏటా అస్సాంకు ఒక్క నెలలోనే వచ్చే ఐదు లక్షల మంది పర్యాటకుల్లో భారీగా కోతపడిందని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది.

 

Similar News