నేను రోడ్డు మీదకు వస్తే మీ ఆర్మీలు పనిచేయవు..పవన్

Update: 2019-12-05 13:13 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను బెదిరించే వైసీపీ నాయకులకు చెబుతున్నా..తాను రోడ్డు మీదకు వస్తే మీ ఆర్మీలు ఏమీ పనిచేయవని హెచ్చరించరు. ‘నాకు జీవితం మీద మమకారం లేదు. సమాజం కోసం ఎక్కడికైనా వస్తా. సనాతన సంప్రదాయాలపై చచ్చేంత మమకారం ఉంది. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలో దేశం కోసం కుటుంబాలను వదిలేసిన వ్యక్తులు ఉన్నారు. పెళ్ళి కూడా చేసుకోకుండా దేశం కోసం తపించే వారు ఉన్నారు. వాళ్ళతో మనం పోటీ పడలేం. ఏ ఫ్యాక్షన్ నాయకుడికి భయపడని యువత మనకి కావాలి’ అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఆయన గురువారం నాడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో అనంతపురం, హిందుపురం పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యారు.

డబ్బే సంపాదించాలనుకుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదన్నారు. డబ్బు పెరిగే కొద్దదీ పోరాడేతత్వం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. తనకు జానీ సినిమాకే రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వచ్చిందని..ఆ డబ్బులు పెట్టి మాదాపూర్ లో 30 ఎకరాలు కొని ఉంటే ఇప్పుడు వేల కోట్ల రూపాయల వచ్చేవన్నారు. వ్యాపారాలు లేని రాజకీయ నేతలే ఆదర్శ నేతలు అవుతారని అన్నారు. కొంత మంది ఇఫ్పటికీ తనను కొంత మంది బీ టీమ్ అని..ప్యాకేజీ స్టార్ అంటూ ఏవేవో విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు సభలోనే టీడీపీతో విభేదించిన సంగతిని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్.

జనసేన నేత వివాదస్పద వ్యాఖ్యలు

అనంతపురం జిల్లాకు చెందిన జనసేన నాయకుడు సాకే పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సమావేశంలో కలకలం రేపాయి. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల బెదిరింపులు ఎక్కువ అయ్యాయని విమర్శించారు.. తమ అధినేత పవన్ కల్యాణ్ సై అంటే వైసీపీ వారి తలలు నరుకుతానంటూ వ్యాఖ్యానించారు.దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎంతో ఆవేదన చెందాడు కాబట్టే సాకే పవన్ ఆ మాట అన్నాడని తెలిపారు. ఎన్నోసార్లు రాప్తాడులో సాకే పవన్‌ను బెదిరించారని తెలిపారు. తలలు తీస్తానంటే కేసులు పెడతారా ? అని ప్రశ్నించారు. సాకే పవన్ పై కేసు పెడితే తనపై కూడా కేసు పెట్టాలని కోరారు. మాజీ సీఎం చంద్రబాబును ఉరి తీయాలని జగన్ అన్నారని... అప్పుడు ఆయనపై ఏ కేసు పెట్టారని పవన్ వ్యాఖ్యానించారు. గతంలో జగన్‌పై ఏ కేసు పెట్టారో సాకే పవన్‌పై అదే కేసు పెట్టాలని అన్నారు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇది ఫ్యాక్షన్ సీమ కాదని.. సింహాల సీమ అని అన్నారు. వైసీపీ నేతలు దాడికి దిగితే... తాము కూడా ఎదురుదాడి చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

 

Similar News