టీడీపీకి మరో షాక్.. గుంటూరు ఎమ్మెల్యే ఔట్!

Update: 2019-12-30 12:23 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై పొగడ్తలు. టీడీపీ అధినేత తీరుపై విమర్శలు. ఆయన అసలు విషయం చెప్పకుండానే తన వైఖరి ఎలా ఉండబోతుందో స్పష్టం చేశారు. దీంతో టీడీపీకి మరో ఎమ్మెల్యే దూరం అవుతున్నట్లే కన్పిస్తోంది. ఆయనే గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. సోమవారం నాడు తాడేపల్లిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలసి సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదర్శవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతే కాదు..ఇంగ్లీష్ మాధ్యమం విషయంలో టీడీపీ వైఖరిని ఆయన తప్పుపట్టారు. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పాలనే ఉద్దేశంతోనే ఉన్నారని చెప్పారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని జగన్ చెప్పారని..రాజధాని అంశంపై సీఎంకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు.

అదే సమయంలో నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 25 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాల్సిందిగా జగన్ అధికారులను ఆదేశించారని తెలిపారు. ఓ వైపు రాజధాని అంశంపై రగడ సాగుతున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్ తో సమావేశం అవటమే కాకుండా..ఆయన విధానాలను ప్రశంసలతో ముంచెత్తటంతో ఆయన కూడా జంపింగ్ కు మార్గం సుగమం చేసుకున్నట్లే అని పార్టీ వర్గాలు కూడా ఓ అంచనాకు వచ్చాయి. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీపై తీవ్ర విమర్శలు చేసి అసెంబ్లీలో స్వతంత్ర సభ్యుడిగా గుర్తింపు పొందారు. మరి మద్దాలి గిరి ఏ మార్గాన్ని ఎంచుకుంటారో వేచిచూడాల్సిందే.

 

 

 

Similar News