జగన్ ఒక్క కామెంట్...రెండు నష్టాలు!

Update: 2019-12-10 14:43 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు అసెంబ్లీలో చేసిన ఒక్క కామెంట్ ఆయనకు రెండు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఒకటి సన్నబియ్యం విషయంలో ‘సాక్షి’ తప్పు రాసిందని చెప్పటం ద్వారా ఆయన తన పేపర్ ప్రతిష్టను తానే తగ్గించుకున్నట్లు అయింది. అంతే కాదు..ప్రతిపక్ష టీడీపీ వెంటనే జగన్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని సాక్షిని తనదైన స్టైల్ లో టార్గెట్ చేసింది. ఇది వైసీపీకి ఒకింత ఇరకాటంగా మారింది. అంతే కాదు..సాక్షి కాదు..మిగతా పేపర్లు చూడండి నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించటం ద్వారా సాక్షిని ఇరకాటంలోకి నెట్టారు జగన్. తాత్కాలికంగా అది ఆయనకు ఊరట లభించినా అసలు విషయం వేరే ఉంది. ఏపీలో కొత్తగా కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ‘సన్నిబియ్యం’ ఇస్తామని స్పష్టంగా ప్రకటించింది. మేనిఫెస్టోలో లేకపోయినా అధికారికంగా చెప్పిన తర్వాత ఇప్పుడు మాట మార్చిన విషయం స్పష్టంగా కన్పిస్తోంది.

ఈ విషయాన్ని ఒక్క సాక్షే కాదు..ఈనాడు, ఆంధ్రజ్యోతోపాటు ఇతర అన్ని పత్రికలు ఇదే విషయాన్ని ప్రచురించాయి. ముందు ప్రభుత్వం సన్నిబియ్యం అని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తర్వాత మాత్రం వైసీసీ సర్కారు సన్నబియ్యం నుంచి నాణ్యమైన బియ్యంగా మాట మార్చింది. ఏకంగా సర్కారు సమీక్షల్లోనే సన్నబియ్యం అని అధికారికంగా ప్రకటించారు. తర్వాత మాట మార్చారు. మాట ఇస్తే మడమ తిప్పం అని చెప్పుకునే జగన్ సర్కారుకు ఇది రాజకీయంగా ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామమే. అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన ఒక్క కామెంట్ తో రెండు రకాలుగా నష్టం జరిగిందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ చెప్పినట్లు కాకుండా ఈనాడులో కూడా సన్నబియ్యం అనే వార్త వచ్చింది. ఈ క్లిప్పింగ్ ను కూడా వార్తలో చూడొచ్చు.

 

 

Similar News